సతాయిస్తున్న సర్వర్‌

23 Jan, 2019 06:17 IST|Sakshi

స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులకు తిప్పలు  

రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లో జనరేట్‌ అవుతున్న ఈ–చలాన్‌  

బ్యాంక్‌ సర్వర్‌లో మాత్రం ఆలస్యం  

చెల్లింపులకు దస్తావేజుదారుల పడిగాపులు  

సాక్షి, సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు మూహూర్తాలు పెట్టుకొని మరీ స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్న దస్తావేజుదారులకు స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు చుక్కలు చూపుతోంది. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లో ఈ–చలాన్‌ జనరేట్‌ అవుతున్నా... బ్యాంక్‌ సర్వర్‌లో మాత్రం కనిపించే సరికి ఆలస్యమవుతోంది. ఫలితంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు పెట్టుకున్న ముహూర్తాలు మించిపోతుండడంతో దస్తావేజుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం ఈ–చలాన్‌ విధానం ప్రవేశపెట్టగా, సర్వర్‌ మొరాయిస్తుండడంతోఇబ్బందులు తప్పడం లేదు. ఈ–చలాన్‌కు సర్వర్‌ అనుసంధానం అంతర్జాల అంతర్గత సమస్యగా తయారైంది. 

సాఫ్ట్‌వేర్‌ సమస్య...
బ్యాంక్‌ సర్వర్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్యగా మారింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) వీలినం తర్వాత స్టాంప్‌ డ్యూటీ ఈ–చలాన్‌ బాధ్యత కేవలం ఎస్‌బీఐకే పరిమితమైంది. దీంతో బ్యాంక్‌ సర్వర్‌పై ఈ–చలాన్‌ భారం అధికమై సాఫ్ట్‌వేర్‌ సమస్య తలెత్తింది. వాస్తవానికి ఈ–చలాన్ల స్వీకరణకు రిజిస్ట్రేషన్ల శాఖ ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం కుదర్చుకుంది. గత రెండేళ్ల వరకు దస్తావేజుదారులు స్టాంప్‌ డ్యూటీ ఈ–చలాన్‌ చెల్లింపులు ఎస్‌బీహెచ్‌ ద్వారానే చేసేవారు. అయితే బ్యాంకుల విలీనం తర్వాత అది ఎస్‌బీఐకి మారింది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్‌ సర్వర్‌ ముప్పుతిప్పలు పెట్టగా, ప్రస్తుతం బ్యాంకు సర్వర్‌కు అనుసంధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఉదయం ఈ–చలాన్‌ జనరేట్‌ అవుతుండగా, సాయంత్రం నాలుగైదు గంటలైతే తప్ప బ్యాంక్‌ సర్వర్‌లో ఈ–చలాన్‌ కనిపించడం లేదు.  

టోకెన్లతోనూ తిప్పలు...  
బ్యాంకుల్లో ఈ–చలాన్‌ చెల్లింపులకు ఆన్‌లైన్‌ టోకెన్‌ విధానం అమలవుతుండడంతో దస్తావేజుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దస్తావేజుదారుడు ఈ–చలాన్‌ చెల్లింపు కోసం టోకెన్‌ తీసుకొని గంటలకొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. తీరా టోకెన్‌ సంఖ్య వచ్చేసరికి బ్యాంక్‌ సర్వర్‌లో ఈ–చలాన్‌ చూపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దస్తావేజుదారు తిరిగి టోకెన్‌ తీసుకొని మళ్లీ నంబర్‌ వచ్చేసరికి వేచి చూడాల్సి వస్తోంది. బ్యాంక్‌ సర్వర్‌లో ఈ–చలాన్‌ కనిపించే వరకు బ్యాంకర్లు చెల్లింపులు తీసుకోవడం లేదు. ఈ–చలాన్‌ చెల్లింపులు చేసిన తర్వాత కూడా తిరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సర్వర్‌లో క్లియర్‌ చేసుకోవడానికీ అష్టకష్టాలు తప్పడం లేదు. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు నిర్ణయించుకున్న ముహూర్తాలకు పూర్తి కాకపోవడంతో దస్తావేజుదారులు నిరాశ చెందుతున్నారు.

మరిన్ని వార్తలు