రెస్టారెంట్లలో సర్వీసు చార్జీ చట్ట వ్యతిరేకం: సీవీ ఆనంద్‌

12 Nov, 2017 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారుల బిల్లులో అదనంగా సేవా రుసుం (సర్వీస్‌ చార్జీ) వేయడానికి వీల్లేదని, ఇది చట్ట వ్యతిరేకమని పౌర సరఫరాల శాఖ కమిషనర్, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. సర్వీసు చార్జీని బిల్లులో అదనంగా వేస్తే వినియోగ దారుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హోటల్‌ యజమానులను హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు  తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. వినియోగదారుల నుంచి సర్వీసు చార్జీల వసూలుపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్‌ ఆనంద్‌ హోటల్స్‌ అసోసియే షన్‌ ప్రతినిధులతో శనివారం పౌర సరఫరాల భవన్‌లో సమావేశం నిర్వహించారు.

వినియోగదారుడికిచ్చే బిల్లులో సర్వీసు చార్జీ స్వచ్ఛందంగా చెల్లించే అంశం అని స్పష్టంగా పేర్కొనాలని, ఆ అంశం దగ్గర ఎటువంటి రుసుం పేర్కొనకుండా ఖాళీగా వదిలేయాలని, దానిని వినియోగదారుడు బిల్లు చెల్లించే సమయంలో తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటాడని సూచించారు. బలవంతంగా సర్వీసు చార్జీలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి ఆ కేసులను రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి అప్పగిస్తామ న్నారు. ఈ విషయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాల న్నారు. సర్వీసు చార్జీల వసూలుపై వినియోగ దారులు పౌరసరఫరాల శాఖ వాట్సాప్‌ నంబర్‌ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖ 9490165619 నంబర్లకు ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు