మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్

6 Apr, 2016 03:36 IST|Sakshi
మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్

 పీఆర్‌సీ ఫైలుపై సంతకం చేసిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ రూపొం దించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో పాటు టీచర్లకు, సిబ్బందికి పీఆర్‌సీ వర్తింపజేసే ఫైలుపై సంతకం చేశారు. ఫలితంగా ఇప్పటివరకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించనుంది. కేంద్రం చేతులెత్తేసిన తర్వాత మోడల్ స్కూల్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంలా మారిన విషయం తెలిసిందే. పదో పే రివిజన్ కమిషన్ అమల్లో భాగంగా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. 2014 జూన్ నుంచి ఇది అమలు చేసింది.

మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపాల్స్‌కు మాత్రం ఇది వర్తించలేదు. మరోవైపు కేంద్రం మోడల్ స్కూళ్ల నిర్వహణ నుంచి వైదొలగడంతో చిక్కులు తలెత్తాయి. దీంతో ఈ సిబ్బందిని ఏ కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించాలి.. వాళ్ల సర్వీస్ రూల్స్ ఏమిటనే సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో మిగిలిన ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన పీఆర్‌సీ ఫిట్‌మెంట్ వర్తింపజేసే అంశం పెండింగ్‌లో పడింది. తెలంగాణలోని 182 మోడల్ స్కూళ్లలో 3,368 మంది ఉద్యోగులున్నారు. సీఎం సంతకంతో వీరందరికీ ఊరట లభించింది.

మరిన్ని వార్తలు