వచ్చే వారంలో సెట్స్ నోటిఫికేషన్లు!

5 Feb, 2016 03:41 IST|Sakshi
వచ్చే వారంలో సెట్స్ నోటిఫికేషన్లు!

♦ అంతకంటే ముందుగా  కన్వీనర్ల నియామకం
♦ ఎంసెట్ కన్వీనర్  బాధ్యతలపై ఉత్కంఠ!
♦ ఉన్నత విద్యా మండలి కసరత్తు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను వచ్చే వారంలో జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్ నిర్వహణ తేదీలను, పరీక్ష నిర్వహించే యూనివర్సిటీలను ఎంపిక చేసిన మండలి ప్రస్తుతం సెట్స్ కన్వీనర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు లేఖలు రాసింది. ఒక్కో సెట్ నిర్వహణకు ముగ్గురి పేర్లను సూచించాలని ఆదేశించింది. ఇప్పటికే కన్వీనర్ల ఎంపికకు కొన్ని సెట్లకు కొందరి పేర్లను సూచించగా, మరికొన్ని సెట్‌లకు పేర్లు రావాల్సి ఉంది.

వాటిని రెండు మూడు రోజుల్లో అందజేయాలని విశ్వవిద్యాలయాలను మండలి ఆదేశించింది. అవి రాగానే ఈనెల 8 లేదా 9న ఒక్కో సెట్‌కు ఒక్కో కన్వీనర్‌ను ఎంపిక చేసి, వెంటనే ఆయా కన్వీనర్లు నోటిఫికేషన్లు జారీచేసేలా చర్యలు చేపట్టింది. మే 19న ఐసెట్ ను, 24న మూడేళ్ల, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్‌ను నిర్వహించే బాధ్యతలను కాకతీయ వర్సిటీకి అప్పగించింది. గత ఏడాది కూడా వాటిని కాకతీయనే నిర్వహించినందున అప్పుడు కన్వీనర్లుగా చేసిన వారికే ఈసారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే వర్సిటీ ఇచ్చే జాబితాలోని మూడు పేర్లలో వారుంటే వారికే అప్పగించే అవకాశం ఉంది. ఇక మే 11 నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, 27న ఎడ్‌సెట్, 29న పీజీఈసెట్‌లను నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా ఉస్మానియాకే అప్పగించింది. అందువల్ల వీటికి కూడా గత ఏడాది కన్వీనర్లుగా వ్యవహరించిన వారినే మళ్లీ నియమించే అవకాశం ఉంది.

తేలాల్సింది ఎంసెట్ వ్యవహారమే
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న జరిగే ఎంసెట్-2016 నిర్వహణ బాధ ్యతలు ఎవరికి అప్పగిస్తారన ్న దానిపై ఉత్కంఠ నెల కొంది. గతంలోలాగే ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణను హైదరాబాద్ జేఎన్‌టీయూకే అప్పగించినప్పటికీ, కన్వీనర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. గత ఏడేళ్లు ఎంసెట్ కన్వీనర్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి కూడా ఆయనకే అప్పగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో కొన్ని యాజమాన్యాలు రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయనపై పలు ఆరోపణలు చేశాయి. ఆ వ్యవహారంతో ఎంసెట్ నిర్వహణకు సంబంధం లేనప్పటికీ 2016-17లో ఆబా ధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఉత్కం ఠగా మారింది. అలాగే మే 12న ఈసెట్ నిర్వహణను కూడా జేఎన్‌టీయూకే అప్పగిం చింది. దీనికి గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ యాదయ్యకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు