-

సెటిల్‌మెంట్ ఉచ్చు

4 Sep, 2014 03:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సివిల్ తగాదాల్లో తలదూర్చినందుకు... పోలీసు విభాగం ఇరుకున పడింది. చినికి చినికి గాలివానగా మారిన ఒక కుటుంబ ఆస్తి తగాదా పోలీసు అధికారుల మధ్య చిచ్చు రేపింది. ఈ రాద్ధాంతంలో సీఐ లక్ష్మీబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్, కుటుంబ తగాదాల్లో తలదూర్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శివకుమార్ ప్రకటించారు. దీంతో దాదాపు కోటిన్నర రూపాయల విలువైన ఈ ఆస్తి తగాదా వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీసు అధికారుల మధ్యనే చిచ్చు పెట్టినట్లయింది. మూడు రోజుల కిందట పెద్దపల్లి డీఎస్పీ, గంగాధర ఎస్సైతో తమకు ప్రాణభయం ఉందని.. తమ కుటుంబానికి సంబంధించిన భూ తగాదాలో తలదూర్చి తమను బెదిరిస్తున్నట్లు గంగాధర మండల కేంద్రానికి చెందిన అన్నతమ్ముళ్లు శ్రీరాం మల్లేశం, శ్రీరాం రవీందర్ నార్త్‌జోన్ ఐజీకి ఆగస్టు 30న ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఐజీ ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు.
 
 సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా.. ఇదే ఘటనలో వెకెన్సీ రిజర్వులో ఉన్న సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేయటంతో ఈ సెటిల్‌మెంట్ల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. గంగాధర పోలీస్‌స్టేషన్‌కు సంబంధం లేని సీఐ లక్ష్మీబాబును సస్పెండ్ చేయటం... ఎస్సై, డీఎస్పీలపై వచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేస్తుంటే ఈయన ఎందుకు ఇరుక్కున్నారు? అనేది సందేహాస్పదంగా మారింది. ఈ ఘటనలో రవీందర్, మల్లేశం ఐజీకి ఫిర్యాదు చేయటం వెనుక సీఐ లక్ష్మీబాబుపాత్ర ఉందనేది ప్రధాన అభియోగం. మరోవైపు బాధితుల్లో ఒకరైన రవీందర్‌కు సీఐకి దగ్గరి దోస్తానా ఉంది.
 
 అందుకే వారికి మద్దతుగా ఈ భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు రూ.లక్షల్లో ఒప్పందం చేసుకున్నాడనే అభియోగంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించటం తగదని... కొద్ది రోజుల్లో తానే చొప్పదండి సీఐగా వస్తున్నానని అప్పుడు ఈ తగాదాను సెటిల్ చేస్తానని సీఐ లక్ష్మీబాబు స్థానిక పోలీసు అధికారులతోనూ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు గుప్పుమంది. కానీ.. ఈ తగాదాలో అసలు పోలీసు అధికారులు ఎందుకు తలదూర్చారు.. లక్ష్మీబాబు ఒకవైపు వకాల్తా పుచ్చుకున్నట్లు ధ్రువీకరించిన పోలీసు యంత్రాంగం... మరోవైపు మద్దతు పలికినట్లుగా ఫిర్యాదులు ఎదుర్కొన్న ఎస్సై, డీఎస్పీల  పాత్ర ఏమిటి? అనేది వెల్లడించలేదు. సెటిల్‌మెంట్ దందాలో ఒకరి ప్రమేయాన్ని ఒకరిపై తోసిపుచ్చేందుకు పోలీసు అధికారులు ఈ కేసును తమకు అనుకూలంగా మలుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కొందరిని వెనుకేసుకు వచ్చి.. ఒక్కరిపైనే వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 అసలేం జరిగింది
 గంగాధర మండలకేంద్రానికి చెందిన శ్రీరాం మల్లేశం, రవీందర్, మధుకర్ ముగ్గురు అన్నదమ్ములు. మల్లేశం, రవీందర్ స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతుండగా... చిన్న కుమారుడు మధుకర్ బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అన్నదమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. పలుమార్లు పంచాయితీలు నిర్వహించుకున్నా పరిష్కారం కాలేదు. జూలై మొదటి వారంలో మధుకర్ తన సోదరులైన మల్లేశం, రవీందర్‌పై గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్, డీఎస్పీ వేణుగోపాల్‌రావుకు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పంచాయితీ పెట్టడంతోపాటు.. మధుకర్‌కు మద్దతుగా సివిల్ పంచాయితీలో తలదూర్చిన డీఎస్పీ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మల్లేశం, రవీందర్ కలిసికట్టుగా ఐజీకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న ఫోన్‌రికార్డులను సమర్పించారు.
 
 హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
 మరోవైపు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్‌తో తన కుమారులకు ప్రాణభయం ఉందని మల్లేశం, రవిందర్ తల్లి లక్ష్మి బుధవారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. తన కుమారులతోపాటు తనను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నానా బూతులు తిట్టారని అందులో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు