10రూపాయలకే రెండు పూటలా భోజనం..

15 Jun, 2018 15:58 IST|Sakshi
భోజనం పెడుతున్న సేవా భారతి ట్రస్ట్‌ సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌ : జబ్బు చేసి ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి ఒకలా ఉంటే... వారిని పరామర్శించడానికి వచ్చే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారి పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరోజులో చూసి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందే. పట్నంలో పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లు ఉంటాయి. అలాంటి వారి పట్ల ఆత్మీయ బంధువవుతుంది ‘సేవా భారతి ట్రస్ట్‌’. రోగులకు, వారితో పాటు వచ్చే బంధువులకు కూడా రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ఉండటానికి వసతి కల్పిస్తుంది ఈ ట్రస్ట్‌. ఇదంతా కూడా కేవలం ‘పది రూపాయలకే’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

దూర ప్రాంతం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అలానే వారితో పాటు వచ్చే కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టి ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ట్రస్ట్‌ ప్రారంభమైంది. ఈ విషయం గురించి ‘సేవా భారతి ట్రస్ట్‌’ సెక్రటరీ నర్సింహమూర్తి ‘మొదట మేము కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించే వాళ్లం. కానీ 2013లో గాంధీ ఆస్పత్రి సుపరిండెంట్‌ ‘రోగుల కోసం వచ్చే వారి కోసం వసతి కల్పించమ’ని కోరాడు. దాంతో మేము ఈ వసతి గృహాన్ని నిర్మించాము. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేము ఈ భవనాన్ని నిర్మించాం. దీన్ని నిర్మించిన కొత్తలో రోజుకు కేవలం పది మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఇక్కడ దాదాపు రెండు వందల మంది వరకూ బస చేస్తున్నారు. వారానికి దాదాపు 7 వేల మందికి బస కల్పిస్తున్నామని’ చెప్పారు.

మరిన్ని వార్తలు