జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు

19 Nov, 2019 05:26 IST|Sakshi

ఈ సీజన్లో రెండున్నర రెట్లు అధికం

200 ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాది బడ్జెట్‌ ఈ సీజన్లోనే ఖర్చు

నిధులు లేక విలవిలలాడుతున్న టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

అదనపు నిధులు కేటాయించాలని విన్నపం

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ, చికున్‌ గున్యా, ఇతర విష జ్వరాల దెబ్బకు ఆసుపత్రుల్లో మందులు అవసరానికి మించి వినియోగమయ్యాయి. కీలకమైన మూడు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఏకంగా ఏడున్నర కోట్ల జ్వరం మాత్రలు వాడేశారు. సాధారణంగా ఈ కాలంలో రెండున్నర కోట్లు అవసరం కాగా, ఈసారి అదనంగా ఐదు కోట్లు వినియోగించారని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) వర్గాలు వెల్లడించాయి. అవన్నీ కూడా పారాసిటమాల్, డోలో వంటి మాత్రలే కావడం గమనార్హం. వాటితోపాటు జ్వరాన్ని తగ్గించే యాంటి పైరేటిక్స్, యాంటి బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌నూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. డెంగీ నిర్దారణ కిట్లు కూడా దాదాపు మూడు రెట్ల మేరకు పెరిగినట్లు అంచనా వేశామని వారు చెబుతున్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వంటివి కూడా అదేస్థాయిలో వినియోగమయ్యాయి. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో డెంగీ, సీజనల్‌ జ్వరాలు విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారమే రాష్ట్రంలో 10 వేల మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ జరిగింది. దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు లెక్కలకు రెండింతలు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

మూడు నెలలకే ఖతం... 
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నీ కలిపి 1,056 ఉన్నాయి. ఈ ఏడాది ఆయా ఆసుపత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి రూ.226 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఆ నిధులతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అత్యవసరమైనప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఇచ్చిన బడ్జెట్‌లో 20 శాతం ఆసుపత్రులకు కేటాయిస్తారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఆసుపత్రులకు కేటాయించిన ప్రత్యేక నిధులను కూడా వాటికే వినియోగించారు. 200 ఆసుపత్రుల పరిధిలో ఏడాదికి మందుల కొనుగోలుకు కేటాయించిన సొమ్ము మూడు నెలలకే ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రులకు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి అవసరమైన మందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి నిధుల సమస్య ఏర్పడింది.

పెద్ద ఎత్తున జ్వరం మాత్రలు కొనుగోలు చేశాం
సీజన్‌ మూడు నెలల కాలంలో పెద్ద ఎత్తున జ్వరాలు విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జ్వరానికి సంబంధించిన మందుల వినియోగం భారీగా పెరిగింది. గతేడాది కంటే ఈసారి జ్వరం మాత్రల వినియోగం రెండింతలు అదనంగా పెరిగిందని తేలింది. డెంగీ కిట్లు కూడా భారీగానే వినియోగించాం. ఏడాది బడ్జెట్‌కు అదనంగా మరో రూ.50 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

మరిన్ని వార్తలు