ఖాతా‘దారులు’ బంద్

27 Sep, 2014 00:35 IST|Sakshi

బ్యాంకులకు వారం రోజులు సెలవులు

మంచిర్యాల టౌన్ : బ్యాంకు ఖాతాదారులు ఈ నెల 29లోపు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వారం రోజులు కష్టాలు తప్పవు. అవును.. ఇది నిజం. రోజూవారీ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ క్రమంలో నగదు జమ, చెల్లింపులు బ్యాంకు ద్వారా జరుపుకునేవారు కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే.. సెప్టెంబర్ 30న అర్ధ ఆర్థిక సంవత్సరం ముగింపు..  అక్టోబర్ 1న మరో అర్ధ ఆర్థిక సంవత్సరం ప్రారం భం ఉంటుంది. దీంతో ఈ రెండు రోజులూ బ్యాంకు అధికారులు బిజీబిజీగా ఉంటారు.
 
ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు దినం. 3న విజయదశమి(దసరా) సెలవు. 4న శనివారం మాత్రమే సగం దినం కార్యకలాపాలు సాగుతాయి. 5న ఆదివారం సెలవు. ఇక 6న బక్రీద్ పండుగ సెలవు(5వ తేదీన బక్రీద్ కాగా, బ్యాంకులు 6వ తేదీని బక్రీద్ సెలవుగా ప్రకటించుకున్నాయి). అంటే బ్యాంకుల కార్యకలాపాలు తిరిగి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అందుకే బ్యాంకు సంబంధిత కార్యకలాపాలు జరిపేవారు ఈ వారం రోజుల కష్టాన్ని తప్పించుకోవాలంటే కాస్త ముందు జాగ్రత్త పడాల్సిందే.
 
ఏటీఎంలలోనూ డబ్బులు కష్టమే...

బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలు.. పైగా బ్యాంకులకు వరుస సెలవులు. దీంతో నగదు పొందడం కష్టతరంగా మారనున్నాయి. ఈ వారంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సింగరేణి ఉద్యోగులకు దసరా, లా భాల బోనస్‌లు అందనున్నాయి. దీంతో అం దరూ ఎక్కువగా దృష్టి పెట్టేది ఏటీఎంలపైనే. దాదాపు 5 రోజులు వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో డబ్బులు ఉండడం కష్టమే. డబ్బులు డ్రా చేసుకునేవారూ ముందుగా జాగ్రత్త పడితే మంచిది.

మరిన్ని వార్తలు