గీసుకొండ బావిలో 9 మృతదేహాలు

22 May, 2020 11:19 IST|Sakshi

సాక్షి, వరంగల్: ఒక బావిలో ఏకంగా తొమ్మిది మృతదేహాలు కనిపించడం జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం నాలుగు మృతదేహాలు లభించగా, శుక్రవారం మరో ఐదు మృతదేహాలు నీట తేలాయి. దీంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండటం గొర్రెకుంటలోని బావిలో లభ్యమైన మొత్తం మృతుల సంఖ్య 9కి చేరుకుంది. తీవ్ర అనుమానాస్పదంగా మారిన ఈ సంఘటనపై జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మృతిచెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారిలో ఇద్దరు బిహార్‌, ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం. గత ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో గన్నీ సంచుల గోదాంలో (బార్‌దాన్‌) పనిచేస్తున్నట్టు తేలింది. ఈ దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు.

గురువారం తొలుత నాలుగు మృత దేహాలు లభించినప్పుడు హత్యలుగా భావించారు. అయితే, ఈరోజుతో లభించిన మొత్తం 9 మృతదేహాలపైనా ఎక్కడా గాయాలు లేకపోవడం మిస్టరీగా మారింది. ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో కుటుంబ పెద్ద మక్సూద్‌తో పాటు మిగతా సభ్యులు ఉన్నారు. తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారన్న అనుమానాలు తలెత్తాయి. మృతుల్లో మక్సూద్‌ (50) తో పాటు ఆయన భార్య‌ నిషా (45), బుషారా ఖాతూన్‌ ((20), మూడేళ్ల మనవడు బేబీ షకీల్‌, కుమారుడు షాబాజ్‌ అలం (22), సోహైల్ అలం, బీహార్‌కు చెందిన శ్రీరాంగా గుర్తించారు. బావి నుంచి బయటకు తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో యాకూబ్‌ పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల విచారిస్తున్నారు. ఇలావుండగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ సీపీ రవీందర్‌, మేయర్‌ ప్రకాశరావు, కలెక్టర్‌ హరిత తదితరులు పర్యటించి పరిశీలించారు. 

వీరంతా గొర్రెకుంట ప్రాంతంలోని ఒక గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. గత డిసెంబర్‌ నుంచి వీరు అక్కడ పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా మారడం, నెలన్నర నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. భర్తతో విడిపోయిన బుస్రా కూడా తన మూడేల్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటే బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం అనేవారిద్దరు కూడా గోదాంలో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు