అదుపుతప్పి.. ఢీకొట్టి..

1 Dec, 2014 01:09 IST|Sakshi
కారును ఢీకొన్న ఎస్కార్ట్ వాహనం

* కారు, బైక్‌ను ఢీకొన్న డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం
* నలుగురు పోలీసులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
* వరంగల్ జిల్లా యశ్వంతాపూర్ శివార్లలో ఘటన

జనగామ రూరల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి కారును, బైక్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ మండలం యశ్వంతాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజయ్య ఆదివారం జనగామలోని ఓ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వరంగల్ వైపు ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఇదే సమయంలో రఘునాథపల్లి పోలీస్‌స్టే షన్ కానిస్టేబుల్ కంజర్ల బాబు, హోంగార్డు వెంకటరత్నం బైక్‌పై జనగామ వైపు వస్తున్నారు. వారి వాహనం వెనుక నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నయీముల్లాఖాన్ (ఎఫ్‌సీఐ ఏడీ) తన బంధువులతో కలిసి జనగామవైపు వస్తున్నారు.

ఈ క్రమంలో యశ్వంతాపూర్ శివార్లలో ఎస్కార్ట్ వాహనం టైర్ పంక్చర్‌కావడంతో అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న బైక్, కారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంజర్ల బాబు, వెంకటరత్నంతో పాటు ఎస్కార్ట్ వాహనంలోని పోలీసులు జగన్‌మోహన్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. కారులో ఉన్న నయీముల్లాఖాన్, ఉన్నిసాబేగం తీవ్రంగా గాయపడ్డారు.
 

>
మరిన్ని వార్తలు