జాతరను విజయవంతం చేద్దాం

7 Feb, 2019 12:43 IST|Sakshi
ఏడుపాయల్లో పర్యటిస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు

పాపన్నపేట(మెదక్‌):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల్లో జరిగే మహాజాతరను అధికారులంతా సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి,  కలెక్టర్‌ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం  జాతరపై ఏడుపాయల్లో  అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతరన్నారు. ఈ ఏడాది మాఘ అమావాస్య పుణ్య స్నానాలకు వెల్లువలా తరలివచ్చిన భక్తజనాలను చూస్తే.. శివరాత్రి జాతరకు సుమారు 10లక్షల మంది  వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అదే స్థాయిలో ఏర్పాట్లు  చేయాలని ఆదేశించారు.  లక్షలాది భక్తులు తరలివచ్చే ఏడుపాయల జాతరలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ సూచించారు.

ఈసారి మంజీరా నదిలో నీరు లేనందున ఘనపురం ప్రాజెక్ట్‌ మడుగుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి చెక్‌డ్యాం నింపాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు వరకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల స్నానాల కోసం షవర్‌ బాత్‌ల సంఖ్య పెంచాలన్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు అనువుగా వసతులు కల్పించాలన్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ట్యాంకర్లను వినియోగించాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టి రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం కల్పించాలన్నారు. 750 మంది పంచాయతీ సిబ్బందితో నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా 24గంటల పారిశుధ్య  సేవలు అందించాలన్నారు. మంజీరానదిలో ఎక్కడి పడితే అక్కడ భక్తులు స్నానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బస్టాండ్‌ను విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి పోతంశెట్టిపల్లి వైపు నుంచి కూడా జాతరకు వాహనాలను అనుమతిస్తామన్నారు. ఎడ్లబండ్లకు పార్కింగ్‌ ప్రదేశాన్ని కేటాయించాలన్నారు. అమ్మవారి ఆలయాన్ని, రాజగోపుర, పరిసరాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సూచించారు. 24గంటలపాటు నిరంతర విద్యుత్‌ అందించాలని సూచించారు. వైద్య సౌకర్యాలు 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను జాతరలో ప్రచారం చేయాలని సూచించారు. ఈ పనులన్నీ  25వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తిరిగి 26న సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పుడు పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జాతర నిర్వహణ విఫలమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జాతరకు 1,150 మంది పోలీసులను బందోబస్తుకోసం నియమిస్తున్నట్లు అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు.

కాలినడనక కలెక్టర్‌ 
ఏడుపాయల్లో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు  కలెక్టర్, జేసీ నగేశ్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్డీఓలు ఇతర అధికారులతో కలిసి ఘనపురం ఆనకట్టపై నుంచి కాలినడకన జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఏడుపాయల్లోని చెక్‌డ్యాం, అమ్మవారి ఆలయం, ఘనపురం ఆనకట్ట, అంతర్గత రోడ్లు, బస్టాండ్‌ ప్రదేశం, విద్యుత్‌ కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు.

అక్కడ చేసే ఏర్పాట్లను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. వారి వెంట ఏడుపాయల పాలకవర్గ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌శాఖ, ఫారెస్ట్‌శాఖ అధికారులతోపాటు తూప్రాన్‌ ఆర్డీఓ శ్యాంప్రకావ్, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ ఆంజనేయులు, పాలకవర్గ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు