వడదెబ్బతో ఏడుగురి మృతి

25 May, 2014 02:49 IST|Sakshi

చిలుకూరు, న్యూస్‌లైన్: మండలంలోని నారాయణపురంలో శనివారం ఓ మహిళ వడదెబ్బతో మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూర నాగమణి (55) రెండు రోజుల క్రితం పాలారంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురైంది. అక్కడి నుంచి స్వగ్రామం వచ్చిన నాగమణి.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
 చిల్లేపల్లిలో...
 చిల్లేపల్లి, (నేరేడుచర్ల): మండలంలోని చిల్లేపల్లి గ్రామానికి చెందిన బండా ఈశ్వరమ్మ(52) వడదెబ్బతో మృతి చెందింది. శుక్రవారం ఉపాధి పనులకు వెళ్లిన ఈశ్వరమ్మ.. ఇంటికి వచ్చిన అనంతరం అస్వస్థతకుగురైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతిపట్ల ఉపాధిహామీ ఏపీవో శేఖర్ సంతాపం ప్రకటించారు.
 
 చల్లూరులో...
 చల్లూరు(రాజాపేట): మండలంలోని చల్లూరులో మీస అయిలయ్య (55) అనే వికలాంగుడు రోజు మాదిరిగానే శుక్రవారం మేకలు తోలుకుని అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
 
 వల్లాపురంలో...
 వల్లాపురం(నడిగూడెం): మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన నూకపంగు తిరపమ్మ(70) మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైంది.  ఆమె ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
 
 కనగల్‌లో...
 కనగల్: మండలంలోని పడిగిమర్రిలో సుంకిరెడ్డి చంద్రారెడ్డి(62) అనే వృద్ధుడు శనివారం వడదెబ్బతోమృతి చెందాడు.   ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినట్లు స్థానిక సర్పంచ్ జగాల్‌రెడ్డి తెలిపారు.  
 
 పాల సంఘం చైర్మన్ మృతి
 కప్రాయపెల్లి(ఆత్మకూరు(ఎం): మండలంలోని కప్రాయపెల్లి పాల సంఘం అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి(48) వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందా రు. శుక్రవారం పశువులను మేపడానికి పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం అతనికి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో మోత్కూరులోని ప్రైవేట్  ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మందడి నర్సిరెడ్డి  తెలుగు రైతు మండల అధ్యక్షుడిగాను కొనసాగారు.  అంత్యక్రియలు శనివారం కప్రాయపెల్లిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో  స్థానిక సర్పంచ్ బొట్టు మల్లమ్మ, ఎంపీటీసీ సభ్యులు కాంభోజు భాగ్య శ్రీ, వివిధ పార్టీల నాయకులు  పూర్ణచందర్ రాజు, హేమలత, బొట్టు అబ్బయ్య, కాంబోజు భాను, నూనెముంతల బుచ్చిరాములు పాల్గొన్నారు.
 
 మిర్యాలగూడలో...
 మిర్యాలగూడ: పట్టణంలో ని ఈదులగూడకు చెందిన పుట్టపాక పార్వతమ్మ (65)  వడదెబ్బతో మృతి చెందిం ది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పశువుల వద్దకు వెళ్లిన పార్వతమ్మ వడదెబ్బకు గురైంది. స్పృహ కోల్పయి మధ్యాహ్నం మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని  కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు