గ్రేటర్‌కు ఊరట

30 Apr, 2020 10:16 IST|Sakshi
నవరంగ్‌గూడలో పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్‌ వేంకటేశ్వర్లు తదితరులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం కొత్తగా మరో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ప్రస్తుతం కింగ్‌కోఠి ఆస్పత్రి ఐసోలేషన్‌ సెంటర్‌లో తాజాగా మరో 19 మంది చేరారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం 77 మంది ఉండగా, వీరిలో ఏడుగురు కరోనా పాజిటివ్‌ బాధితులు ఉన్నారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా ముగ్గురు చేరారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు కాగా, మిగిలిన వారు అనుమానితులు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇప్పటికే కరోనా వైరస్‌ భారిన పడి గాంధీలో చికిత్స పొందుతున్న ఓ నవజాత శిశువు సహా మరో 13 మంది పిల్లలు పూర్తిగా కోలుకోవడంతో బుధవారం వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 595 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

రామంతాపూర్‌లో ..
రామంతాపూర్‌: రామంతాపూర్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. హబ్సిగూడ డివిజన్‌ రామంతాపూర్‌ పరిధిలోని నవరంగ్‌గూడ బస్తీలో నివపించే మహిళ (58) దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబసభ్యులు సోమవారం చికిత్స నిమిత్తం ఆమెను బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వీరాంజనేయులు, ఉప్పల్‌ డీసీ కృష్ణశేఖర్, వైద్యాధికారి డాక్టర్‌ పల్లవి, ఉప్పల్‌ సీఐ రంగస్వామిలు పరిస్థితిని సమీక్షించి ఆమె కుటుంబసభ్యులు 9 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచి ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి కట్టడి చేశారు. జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని సందర్శించి బస్తీలో బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి ..
జియాగూడ: జియాగూడ దుర్గానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ తేలింది. కుల్సుంపురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జియాగూడ దుర్గానగర్‌లో నివసిస్తున్న వ్యక్తి(26) గోల్కొండ ఏరియాలో జీహెచ్‌ఎంసీ శానిటరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి దగ్గు, జ్వరం వస్తుండడంతో కింగ్‌కోఠి ఆసుపత్రికి వెళ్లాడు. అనుమానం వచ్చిన డాక్టర్లు అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించారు. పరీక్షలు జరిపిన అనంతరం బుధవారం సాయంత్రం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు