డయల్‌ 100కు ఏడేళ్లు!

12 Apr, 2020 04:02 IST|Sakshi

2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డ కంట్రోల్‌ రూమ్‌

నాటి నుంచి 16 కోట్ల కాల్స్‌కు సమాధానం

రోజుకు సగటున 62 వేల ఫోన్‌ కాల్స్‌..

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి ఆపద వచ్చినా.. అందరికీ గుర్తుకు వచ్చే నంబరు డయల్‌ 100. ఈ డయల్‌ 100 కంట్రోల్‌ రూముకు శనివారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013 ఏప్రిల్‌ 11న ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత దీన్ని కూడా విభజించారు. కేవలం నేరాలకు సంబంధించిన కాల్స్‌ మాత్రమే కాదు.. రోడ్డు ప్రమాదాలు, తగాదాలు, చోరీలు, కొట్లాటలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అగ్ని ప్రమాదాలు ఇలా సమస్య ఏదైనా ముందు ఫోన్‌ వెళ్లేది ‘100’కే. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో అత్యంత కీలకమైనది డయల్‌ 100. అందుకే, ఇక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి కాల్‌ని వెంటనే రిసీవ్‌ చేసుకుంటారు. అందులో కొన్ని అనవసరమైనవి, బ్లాంక్‌ కాల్స్, ఫేక్‌ కాల్స్, చిన్నపిల్లలు, ఆకతాయిలు చేసే కాల్స్‌ అలా అనేక రకమైన కాల్స్‌ వస్తుంటాయి.

2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్‌.. 
ఈ ఏడేళ్లలో కంట్రోల్‌ రూము సిబ్బంది 15.9 కోట్లు, అంటే దాదాపుగా 16 కోట్ల ఫోన్‌ కాల్స్‌ స్వీకరించారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 62 వేల కాల్స్, గంటకు 2,597, నిమిషానికి 43 కాల్స్‌ చొప్పున కంట్రోల్‌ రూముకు కాల్స్‌ వెళ్తున్నాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్‌ వచ్చాయి. అంటే రోజుకు 1.25 లక్షల కాల్స్‌ ఆన్సర్‌        చేశారన్నమాట. మూడు షిఫ్టుల్లో పని చేసే ఈ సిబ్బందికి    ఆ ఏడాది మొత్తం నిమిషానికి 86 కాల్స్‌కు పైగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ కాల్స్‌కు స్పందించిన సిబ్బంది వెంటనే బాధితులు ఎక్కడున్నారో కనుక్కుని వారికి తక్షణ సాయం అందజేశారు. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఫోన్‌ కాల్స్‌ని విశ్లేషిస్తే.. 2018 నుంచి తగ్గాయి. కానీ, అత్యవసర కాల్స్‌ పెరగడం గమనార్హం. పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్లు, హాక్‌ ఐ, సోషల్‌ మీడియా మాధ్యమాలు     పెరగడం ఇందుకు కారణం. 

ఏడేళ్లలో డయల్‌ 100కు వచ్చిన కాల్స్‌ వివరాలు 

మరిన్ని వార్తలు