బుల్లి డాక్టర్లు.. భలే

2 Jul, 2019 03:11 IST|Sakshi
కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ ఇస్తున్న డాక్టర్‌ నేహా సుల్తానా

12 ఏళ్ల నేహాను డాక్టర్‌గా చేసి సంతోషాన్నిచ్చిన కాంటినెంటల్‌ ఆస్పత్రి 

గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో వైద్యసేవలందించిన ఏడేళ్ల శృతి 

డాక్టర్‌ కావాలనేది వారి ఆశ. ఉచితంగా, ఉన్నతంగా సేవలందించాలనేది వారి ఆశయం. కానీ, విధి వక్రించింది. పసిప్రాయంలో ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు. డాక్టర్లుగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఆ చిన్నారులు వైద్యచికిత్సల నిమిత్తం నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తమ కల నెరవేరదేమోనన్న వారి బెంగ మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ సహకారంతో సోమవారం డాక్టర్స్‌డే సందర్భంగా తీరింది. యాప్రాన్‌ ధరించి, మెడలో స్టెతస్కోప్‌ వేసుకొని డాక్టర్లుగా అవతారమెత్తారు.    
 – హైదరాబాద్‌ 

మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన పాషా, పర్వీన్‌ దంపతుల కూతురు నేహా సుల్తానా(12) ఆరో తరగతి చదువుతోంది. తన ఊరిలో రోగులను చూసి చిన్నారి నేహా ఎంతో చలించిపోయేది. తాను పెద్దయ్యాక డాక్టరై పేదలకు, ఆపదలో ఉన్నవారికి వైద్యసేవ అందించాలని నేహా నిర్ణయించుకొంది. విధి మాత్రం మరోలా తలిచింది. ఆమె ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లుగా గత ఏడాది నిర్ధారణ అయింది. చిన్నారి కల గురించి మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌వారు తెలుసుకొని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని కాంటినెంటల్‌ ఆస్పత్రి సీఈవో ఫైజల్‌ సిద్ధిఖీ దృష్టికి తీసుకొచ్చారు. మూడు గంటలపాటు ఆ ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించే అవకాశం సిద్ధిఖీ కల్పించారు.  

వెల్‌కమ్‌ డాక్టర్‌ శృతి
ఖమ్మం పట్టణానికి  చెందిన మేడిపల్లి శృతి(7) చలాకీ, హుషారుగా ఉండేది. ఏడాది క్రితం అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం బారినపడింది. కానీ, డాక్టర్‌గా రోగులకు వైద్యసేవలందించాలనేది ఆమె కోరిక. కారులో ఉదయమే ఆసుపత్రికి వచ్చిన శృతికి లక్డీకాపూల్‌ గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ వైద్యులు బొకె, చాక్‌లెట్లతో స్వాగతం పలికారు. యాప్రాన్‌ తొడిగించి, మెడలో స్టెతస్కోప్‌ వేసి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకువెళ్లారు. శృతి రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుంది. డాక్టర్‌ క్యాబిన్‌లో కూర్చుని రోగులను పరీక్షించింది. తరువాత గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.రవీంద్రనాథ్, సీఈవో డాక్టర్‌ రాహుల్, వైద్యులు, సిబ్బందితోపాటు డాక్టర్స్‌ డే వేడుకల్లో పాల్గొంది. డాక్టర్‌ కావాలనుకున్న తన కోరికను గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం సహకారంతో తీరిందని శృతి సంతోషం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి శశిచంద్ర తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు