‘టాప్‌బాస్‌’లకు తప్పని బదిలీలు..? 

22 Jun, 2020 08:25 IST|Sakshi

అనివార్యంగా మారిన ఐపీఎస్‌ల బదిలీలు 

నగరంలోనూ అనేక మంది ‘వెయిటింగ్‌’లో 

ఈ నెలాఖరుకు రిటైర్‌ కానున్న ఓ డీసీపీ 

భారీ స్థాయిలో మార్పుచేర్పులకు అవకాశం 

బోనాలు సైతం లేకపోవడంతో రూట్‌ క్లియర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని పోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్‌చార్జ్‌ల నేతృత్వంలో కొనసాగుతుండగా మరి కొందరు అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ నెలాఖరుకు ఇంకొందరు రిటైర్‌ కానున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఏటా ఈ పండుగకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం కావడంతో ఆ ప్రభావం పోలీసు బదిలీలపై ఉండేది. ఈ ఏడాది అలా కాకపోవడంతో ట్రాన్స్‌ఫర్స్‌కు లైన్‌క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలకు తుదిమెరుగులు దిద్దుతున్న ఉన్నతాధికారులు ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

పదోన్నతి వచ్చి ఏడాది దాటినా... 
నగర పోలీసు చరిత్రలో గత ఏడాది ఓ అరుదైన ఘట్టం ఆవిష్క్రృతమైంది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు అప్పట్లో ఏడుగురు ఉండేవారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో పదోన్నతులు ఇవ్వడంతో పాటే బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారినీ వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాచకొండ జాయింట్‌ సీపీగా పని చేస్తున్న జి.సుధీర్‌బాబును మాత్రం అదే కమిషనరేట్‌కు అదనపు సీపీగా నియమించారు. మిగిలిన వారంతా పై హోదాలో కింది పోస్టుల్లో కింది పోస్టుల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలా, ఈ స్థాయిలో అధికారులు గతంలో ఎన్నడూ పని చేయకపోవడంతో ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది.  

సుదీర్ఘకాలంగా ఎదురు చూపులు...  
పోలీసు కమిషనరేట్‌కు నేతృత్వం వహించే కమిషనర్‌ నుంచి పోలీసు స్టేషన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) వరకు నిర్ధిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంకు అధికారి పోలీసు కమిషనర్‌గా ఉంటారు. సిటీ పోలీసు విభాగానికి ఆయనే బాస్‌ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఐజీ) ర్యాంకు వాళ్ళే ఉంటారు. గత ఏడాది ఐపీఎస్‌ల పదోన్నతి నేపథ్యంలో సిటీ కమిషనరేట్‌లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు  ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం అదే తొలిసారి. 

నగర అదనపు సీపీ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌)గా పని చేస్తున్న షికా గోయల్‌కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగుతున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్‌జోన్‌ డీసీపీగా పని చేస్తున్న ఏఆర్‌ శ్రీనివాస్‌కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్‌ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్‌ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పని చేసే ఆస్కారం ఉండటంతో ఆ పోస్టులోనే కొనసాగుతూ ఇటీవలే డీఐజీగానూ పదోన్నతి పొందారు. నెలాఖరులో రిటైర్‌ అవుతున్న ఈయన మినహా మిగిలిన అధికారులు ఏడాదికి పైగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్నారు.  

‘టాప్‌బాస్‌’లకు తప్పని బదిలీలు..? 
భౌగోళికంగా ఒకటిగా ఉన్న రాజధానిలో పోలీసు పరంగా మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. వీటిని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్‌కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్, సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా ఈ పోస్టులను రెండేళ్లను టెన్యూర్‌ పీరియడ్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఆ టైమ్‌ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా బదిలీలు తప్పవన్నది ప్రతి అధికారికీ తెలిసిన విషయమే. రాజధాని విషయానికి వస్తే హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్‌లు  ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. 

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌కు టెన్యూర్‌ పూర్తి కావడంతో పాటు ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. దీంతో ఈ మూడు పోస్టుల్లోనూ మార్పు చేర్పులు తప్పవని వినిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న దక్షిణ మండల డీసీపీ, నగర సంయుక్త సీపీ (పరిపాలన) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్థాయిల్లోనూ కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో మూడు కమిషనరేట్లలోనూ కొత్త టీమ్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు