మళ్లీ చలి పంజా 

30 Dec, 2018 01:25 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు 

నేడు కూడా ఇదే పరిస్థితి 

ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత 

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో చలి మళ్లీ ఉధృతమైంది. పది రోజుల క్రితం పెథాయ్‌ తుపాను సందర్భంగా రాష్ట్రంపై పంజా విసిరిన చలిపులి.. మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు తీవ్రం కావడంతో జనం వణికిపోయారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2013 డిసెంబర్‌ 9న 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజాగా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

మెదక్‌లో శుక్రవారం 6.8 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. శనివారం 5.8 డిగ్రీలకు పడిపోయింది. దక్షిణ కోస్తా ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారడంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. శనివారం గ్రేటర్‌లో రికార్టు స్థాయిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

2010 డిసెంబర్‌ 21న 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఎనిమిదేళ్ల తర్వాత సాధారణం కన్నా ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

మరిన్ని వార్తలు