‘స్వైన్’ విహారం

22 Jan, 2015 02:46 IST|Sakshi
‘స్వైన్’ విహారం

- జిల్లాను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారి
- ఇరవై రోజుల్లో 53 పాజిటివ్ కేసులు నమోదు
- నగర శివారు మండలాల్లోనే అత్యధికం
- వ్యాధి తీవ్రతతో ఇప్పటి వరకు నలుగురి మృతి


స్వైన్‌ఫ్లూ లక్షణాలు
- జలుబు, తీవ్రమైన దగ్గు
- 102 డిగ్రీలకు పైబడి జ్వరం
- విపరీతమైన ఒళ్లు నొప్పులు
- పారాసిటమాల్ తదితర మాత్రలు వాడినా జ్వరం తగ్గకపోవడం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జలుబు.. దగ్గు.. ఆపై విపరీతమైన జ్వరం.. ఈ లక్షణాలు వరుసగా మూడు రోజులకుపైగా ఉన్నాయా.. అయితే వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లేదా కొండాపూర్ ప్రాంతీయ ఆస్పత్రిలో సంప్రదించాల్సిందే. రక్త నమూనాలు సమర్పించాల్సిందే. ఎందుకంటే స్వైన్‌ఫ్లూ రాకాసి జిల్లాను అతలాకుతలం చేస్తోంది.జిల్లాలో రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్న తరుణంలో.. వ్యాధి వ్యాప్తి వేగంగా ఉంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పతనమవుతుండడంతో ఈ వ్యాధికి ఆజ్యం పోసినట్లవుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు ఏకంగా 53 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. కేవలం బుధవారం (21వ తేదీ) ఒక్కరోజే 9 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇరవై రోజుల్లో నలుగురి బలి..
జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇరవై రోజుల్లో 53 కేసులు నమోదు కాగా.. ఇందులో నలుగురు వ్యాధి తీవ్రతతో మృతి చెందారు. వీరంతా కుత్బుల్లాపూర్, కీసర, మహేశ్వరం, శామీర్‌పేట పీహెచ్‌సీల పరిధికి చెందినవారుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సరూర్‌నగర్, రాజేంద్రగనర్ మండలాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

25 డిగ్రీలకు తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఈ వైరస్ ఉత్తేజితంగా పనిచేస్తుంది. వాస్తవానికి వ్యాధి లక్షణాలు గుర్తించిన మరుక్షణమే గాంధీ ఆస్పత్రిలో లేదా కొండాపూర్ ప్రాంతీయ ఆస్పతిలో సంప్రదించి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ వైద్య,ఆరోగ్య శాఖ యంత్రాంగం వ్యాధి పట్ల చైతన్యం కల్పించడంలో విఫలం కావడంతో.. వ్యాధి లక్షణాలున్న పలువురు సాధారణ చికిత్సకే పరిమితమవుతున్నారు. దీంతో వ్యాధి తీవ్రత అధికమైన తర్వాత పెద్దాస్పత్రులకు వెళ్లడంతో వ్యాధి నిర్దారణ మాత్రమే జరుగుతోంది. అప్పటికే స్వైన్‌ఫ్లూ తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకోవడంతో పలువురు మృత్యువాతపడుతున్నారు.
 
వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్తత..
స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి వ్యాధిపట్ల ప్రజలకు విసృ్తత అవగాహన కల్పించి, క్షేత్రస్థాయిలో పర్యటించి చైతన్యపర్చాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతోంది రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే. దీంతో తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు మాత్రం వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ముంద్రించేందుకు తాజాగా ఉపక్రమించడం గమనార్హం.

మరోవైపు స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంటే ఎబోలాకు సంబంధించిన కరప్రతాలు, గోడపత్రికలు పంపిణీ చేస్తున్నారు. బుధవారం ఘట్‌కేసర్, మహేశ్వరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేశారు. వ్యాధి నివారణకు సంబంధించి 500 మాత్రలు జిల్లాకు వచ్చాయని, వీటిని పీహెచ్‌సీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ లలిత తెలిపారు.
 
18 నెలల బాలుడికి స్వైన్‌ఫ్లూ
శామీర్‌పేట్: మండలంలోని దేవరయాంజాల్‌లో 18 నెలల బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాలె రాజు నారాయణ, అలేఖ్య దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. బాలె బిందు (5), బాలె శశాంక్ (3), చిన్న కుమారుడు బాలె నవనీశ్ (18 నెలలు). కాగా నవనీశ్ వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో చూపించినా ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం నగరంలోని బేగంపేట్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో నవనీశ్‌కు పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించినట్లు బాలుడి తండ్రి  రాజునారాయణ బుధవారం సాయంత్రం చెప్పారు. పేద కుటుంబానికి చెందిన తాము అంత ఖరీదు చేసే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటే కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు