ప్రత్యేక రాష్ట్రంలో సమస్యల పరిష్కారం శూన్యం

21 Aug, 2018 14:13 IST|Sakshi
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

 విద్యపై ప్రభుత్వానికి కొరవడిన చిత్తశుద్ధి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు గడుస్తున్నా విద్యారంగం సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేదన్నారు.

సన్నబియ్యం పేరిట నాసిరకం బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో పెడుతున్నారని మండిడ్డారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మూడు నెలలుగా కాస్మోటిక్‌ చార్జీలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు నోట్‌బుక్స్, దుప్పట్లు, ప్లేట్లు, పెట్టలు అందజేయకపోవడాన్ని తప్పుబట్టారు. రెగ్యులర్‌ ఎంఈఓలను నియమించాలని డిమాండ్‌ చేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయడానికి సర్కారుకు మనసు రావడం లేదని ధ్వజమెత్తారు.

ఆగస్టు 15 నుంచి జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తామన్న హామీ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ నీటిమీది రాతగా మారిందని ఎద్దేవా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ రఘునందన్‌రావుకు అందజేశారు.

మరిన్ని వార్తలు