అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

6 Aug, 2019 12:04 IST|Sakshi
షాద్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు..!

ఆన్‌లైన్‌ పనిచేయక పోవడంపై అనుమానాలు

ఎక్కడా కనిపించని రిజిస్ట్రేషన్‌ల వీడియోగ్రఫీ 

సాక్షి, షాద్‌నగర్‌: రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి, పారదర్శకంగా సేవలందించేందుకుగాను ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ నిఘా కెమెరాల కన్నుకప్పి షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో దగా జరుగుతోంది. డబ్బులు ఇస్తేగాని దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. ప్లాట్లు, భూముల కొనుగోలుకు వేర్వేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి దస్తావేజుకు విధిగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాటు రిజిస్ట్రేషన్‌కు ఐదు వందల రూపాయల వరకు, భూముల రిజిస్ట్రేషన్‌కు ఎకరాకు రెండువేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక సమస్యలున్న భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ అయితే అధికారులు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల సహాయంతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, సబ్‌రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి డబ్బులు ముట్టినట్లు సమాచారం అందిన తర్వాతనే కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరుగుతోందని బాహాటంగా చెప్పుకుంటున్నారు. 

నామమాత్రంగానే సీసీ కెమెరాలు
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సీసీ కెమెరాలు కేవలం కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని రికార్డింగ్‌ చేసేందుకే ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని  ప్రజలు కోరుతున్నారు. 

‘చటాన్‌పల్లి’పై కొనసాగుతున్న దర్యాప్తు 
ఇటీవల చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 717లో ప్లాట్‌ నెంబర్‌ 147, 148లో 236 గజాల విస్తీర్ణం గల స్థలానికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్‌లతో ప్లాటు రిజిస్ట్రేషన్‌ జరిగిన వ్యవహారంలో షాద్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ప్లాటు అసలు యజమాని గడగమ్మ రాఘవరావు ఫిర్యాదుతో పోలీసులు ఫరూఖ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్, ప్లాటు కొనుగోలుదారులు జి.శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించినట్లు సమాచారం. చటాన్‌పల్లికి చెందిన ఓవ్యక్తితో పాటు, కేశంపేట రోడ్డుకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. ఫోర్జరీ కేసు నమోదైనప్పటి నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ తన కార్యాలయానికి రాకపోవడంతో అన్ని వ్యవహారాలు కింది స్థాయి సిబ్బందే చూసుకుంటున్నారు.  

ఆన్‌లైన్‌తో సమస్యలు కల్పితమా..? 
ఫోర్జరీ డాక్యుమెంట్‌ వ్యవహారం బయటికొచ్చిన రోజు నుంచి ఫరూఖ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌ సమస్యలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలనే ఆన్‌లైన్‌ను బంద్‌ చేస్తున్నారని, కార్యాలయానికి క్రమం తప్పకుండా వచ్చే వ్యాపారులు, మధ్యవర్తుల పనులను మాత్రమే అధికారులు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఆన్‌లైన్‌ సమస్యతో గత నాలుగు రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకందార్లు ఇబ్బందులు పడుతున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.   

ఏసీబీ దృష్టి సారిస్తే... 
అవినీతి రాజ్యమేలుతున్న షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే గత రెండు నెలల క్రితం షాద్‌నగర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ శేఖర్‌రెడ్డి, అదేవిధంగా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, వీఆర్‌ఓ అనంతయ్యలు పెద్ద ఎత్తున లంచం డబ్బులు తీసుకుంటూ ఏబీసీ అధికారులకు పట్టుపడ్డారు. ఏడాది క్రితం షాద్‌నగర్‌ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రిజిస్ట్రేషన్‌ శాఖలో అధికారులు ఆరోపణలు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై నిఘా వేస్తే అవినీతి చేపలు దొరకే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు