‘షాదీ’.. పరేషానీ

15 Jan, 2015 04:47 IST|Sakshi
‘షాదీ’.. పరేషానీ

షాదీ హోగయేతో...బోజ్ ఉతర్ జాయేగా’ పేదింట ఆడపిల్ల పెళ్లి... నెత్తి మీద భారమే. ఖార్కానాల్లో...సైకిల్ పంక్ఛర్ దుకాణాల్లో రోజు కూలీతో గుట్టుగా సంసారం వెళ్లదీసుకునే నిరుపేద ముస్లింల పరిస్థితి మరీ అధ్వాన్నం. ఎదిగిన ఆడపిల్లకు సంబంధాలు తీసుకురాలేక, అరబ్ షేక్‌లకు ‘నిఖా’ చేసి పంపుతున్న సంఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. అందువల్లే సీఎం కేసీఆర్ నిరుపేద ముస్లింల కోసం కోసం అందించిన అద్భుత వరం ‘షాదీ ముబారక్’. కానీ అధికారుల అలసత్వం, కుల ధ్రువీకరణ పత్రం, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు ‘షాదీ’కి అడ్డం పడుతున్నాయి.  
 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేద ముస్లిం యువతు ల వివాహం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకానికి ఇప్పటి వరకు జిల్లాలో 148 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2014-15 సంవత్సరానికి గాను మైనార్టీ కార్పొరేషన్ కింద సామూహిక వివాహాలు చేసేందుకు కోసం 6.51 లక్షల నిధులు విడుదల కాగా, ఈ నిధుల నుంచే ముగ్గురు ‘షాదీ ముబారక్ లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున పంపిణీ చేశారు.

వాస్తవానికి నిరుపేదలైన మైనార్టీలకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. అందుకే దళిత, గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకం కంటే షాదీ ముబారక్ పథకానికేఎక్కువ స్పందన లభించింది. పథకం నిబంధనల మేరకు వివాహానికి 15 రోజులు ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, నిఖా జరిగి నెలలు గడిచినా నిధులు ఇంతవరకూ మంజూరు కాలేదు.
 
దరఖాస్తులో సగమే పరిశీలన
 షాదీముబారక్ పథకానికి  జిల్లాలో148 మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు ప్రాథమిక పరిశీలనలో 65 దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు (డాక్యుమెంటేషన్) సరిగా లేవనే కారణంతో మిగిలిన వాటిని పక్కన పెట్టారు. ఈ 65 దరఖాస్తుల్లోనూ 41 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వారికి పథకం ముంజూరు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మంజూరు సర్టిఫికెట్ ఇచ్చిన 41 మంది లబ్ధిదారుల్లోని 17 మందికి సంబంధించిన డబ్బును మాత్రమే జిల్లా  కోశాధికారి కార్యాలయానికి పంపారు. కానీ జనవరి 13వ తేదీ వరకు ఏ ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు.
 
సమస్యగా మారిన కుల ధ్రువీకరణ పత్రం
రెవెన్యూ చట్టం ప్రకారం షేక్‌లకు బీసీ-ఈ సర్టిఫికెట్, పఠాన్‌లు, సయ్యద్‌లకు ఓసీ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పఠాన్లను, షేక్‌లను సయ్యద్‌లను గుర్తించడం కష్టంతో కూడుకున్న పని కావడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారీలో తహశీల్దార్లకు కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని ముస్లిం మైనార్టీలు మంత్రి హరీష్‌రావు దృష్టికి,  తహశీల్దార్లు జిల్లా  కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య నుంచి తక్షణం గట్టెక్కడం కోసం  కమ్యూనిటీ పత్రాలు జారీ చేయాలని సూచించారు. అంటే షాదీ ముబారక్ పథకం కోసం కుల ధ్రువీకరణ పత్రం కావాలనుకున్న వారికి ధ్రువీకరణ పత్రంలో ఓసీ, బీసీ-ఈ అనే వర్గీకరణ లేకుండా కేవలం ముస్లిం మైనార్టీ అని మాత్రమే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సూచించారు. అయితే కలెక్టర్ సూచించినట్టుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి  తహశీల్దార్లు వెనుకంజ వేస్తున్నారు.
 
రెండు, మూడు రోజుల్లో డీడీలు అందిస్తాం
డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడంతో 83 దరఖాస్తులు పక్కన పెట్టాం. మరో 24 దరఖాస్తులు అధికారుల పరిశీలనలోనే ఉన్నాయి. షాదీ ముబారక్ లబ్ధిదారులకు రెండు రోజుల్లో డీడీలు అందిస్తాం. ఇప్పటికే 17 మంది లబ్ధిదారుల డబ్బును ట్రెజరీకి జమ చేశాం, కానీ ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలె త్తడంతో వారి ఖాతాల్లో  డబ్బు జమ కాలేదు.  
 -మధు,
 మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి,

మరిన్ని వార్తలు