రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి

25 Dec, 2018 02:13 IST|Sakshi

రాజకీయ పార్టీ విలీనం ఎన్నికల సంఘం పరిధిలోనిది

హైకోర్టును ఆశ్రయించిన షబ్బీర్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఈ నెల 21న జారీ చేసిన బులెటిన్‌ను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఓ రాజకీయ పార్టీ విలీనం ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని, ఈ విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి ఎలాంటి పరిధి లేదని, అందువల్ల విలీన బులెటిన్‌ అమలును నిలిపేయడంతోపాటు, రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ మండలి కాంగ్రెస్‌ సభ్యుడు షబ్బీర్‌ అలీ సోమవారం హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో అసెంబ్లీ కార్యదర్శి, ఫిరాయింపులపై విచారణ జరిపే ట్రిబ్యునల్‌ హోదాలో మండలి చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని షబ్బీర్‌ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహా రం ట్రిబ్యునల్‌ ముందు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. దీనిపై ట్రిబ్యునల్‌ చైర్మన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగానే మండలి చైర్మన్‌ విలీన నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీ కార్యదర్శి విలీన బులెటిన్‌ జారీ చేయడం సరికాదన్నారు. పార్టీ విలీన వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు సంబం ధించిందని, దీనిపై మండలి చైర్మన్‌కు ఎటువంటి నిర్ణయాధికారం లేదన్నారు. ఫిరాయింపులపై తామిచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్న మండలి చైర్మన్‌.. ఫిరాయింపుదారుల విజ్ఞప్తిపై మాత్రం వెంటనే స్పందించి విలీనానికి ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు