‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’

25 Oct, 2019 16:45 IST|Sakshi

ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ  అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్‌నగర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్‌, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్‌:
గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి  హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్‌ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్‌లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం  ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా