పరకాల మునిసిపల్‌ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

27 Jul, 2018 01:54 IST|Sakshi

ఎమ్మెల్యే ‘చల్లా’కు షాక్‌

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పరకాల పురపాలక సంఘ చైర్మన్, వైస్‌ చైర్మన్‌లపై అధికార పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ నెల 5వ తేదీన 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు కలెక్టర్‌కు అందజేశారు. అయితే.. అదేరోజు చైర్మన్‌ రాజభద్రయ్య టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు.

కాగా, గురువారం అవిశ్వాస పరీక్ష కోసం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం హాజరు కాలేదు. కోరం లేని కారణంగా పరకాల పురపాలక సంఘం చైర్మన్‌ రాజభద్రయ్యపై అవిశ్వాసం వీగినట్లు ఆర్డీఓ మహేందర్‌జీ ప్రకటించారు. ఇదే తరహాలో వైస్‌చైర్మన్‌ రమ్యకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి షాక్‌ ఇచ్చినట్లయింది.

మరిన్ని వార్తలు