షహనాజ్‌.. సేవకు సలాం..

9 May, 2020 08:19 IST|Sakshi

సేవకు మరో రూపం షహనాజ్‌..

ఆకలికి అన్నం.. వేదనకు ఔషధం..

లాక్‌డౌన్‌ కష్టాల్లో పేదలకు బాసటగా..  

తాత స్ఫూర్తి ఆమె పథం

సాక్షి, సిటీబ్యూరో: అది ఆకలి.. కానీ ఆ ఆకలి ఎక్కడా కనిపించదు.. నట్టింట్లో మూడంకె వేసుకొని పేగులను గట్టిగా  ముడివేసుకుంటుంది. ఆ రొద వినిపించకుండా పెదాలను చిరునవ్వుతో బిగించేస్తుంది. పేవ్‌మెంట్‌లపైకి రావాలన్నా.. అన్నపూర్ణ ప్లేట్‌లతో కడుపు నింపుకోవాలన్నా సరే.. బిడియం అడ్డొస్తుంది. దాతలను అర్థించకుండా ఆత్మాభిమానం హెచ్చరిస్తుంది. లాక్‌డౌన్‌ అనేక మందిని అనేక విధాలుగా కకావికలం చేసింది. రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికిన వాళ్లను ఆకలి కేకలతో రోడ్డెక్కించింది. కష్టజీవులు, యాచకులు ఒక్కటై  అన్నం కోసం బారులు తీరారు. ఇది నాణేనికి ఒకవైపు.. అయితే మరోవైపు.. చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు చేస్తూ  నెలజీతంతో ఇంటి గుట్టు బయటపడకుండా గుంభనంగా సంసారాన్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి వేతన జీవులు సైతం విలవిల్లాడుతున్నారు.

ఏ వస్త్ర దుకాణంలోనో, మరే షాపింగ్‌ మాల్‌లోనో ఉద్యోగం చేస్తూ  బతికిన వాళ్లు లాక్‌డౌన్‌తో ఉపాధిని కోల్పోయారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్‌డ్రైవర్లు పనుల్లేక పైసల్లేక, పస్తులతో  వెళ్లదీయాల్సి వస్తోంది. చేయిచాచి యాచించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక భారంగా గడిపేస్తున్నారు. అలాంటి వారి కోసం నేనున్నానంటూ అండగా నిలుస్తోంది షహనాజ్‌.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ గవర్నర్‌ దివంగత భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి మనుమరాలు. అసంఘటిత రంగంలో పనిచేస్తూ లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు, కష్టాలను అనుభవిస్తున్న ఎంతోమందికి ఆమె అండగా నిలుస్తోంది.

ఆయన జీవితం ఆదర్శప్రాయం..
ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి చివరి వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. దేశసేవ కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దత్తపుత్రికగా పెరిగిన షహనాజ్‌ తాతలోని సేవాదృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘ఇదంతా నా తృప్తి కోసం మాత్రమే’ అంటూ దాటవేస్తారామె. కానీ ఈ లాక్‌డౌన్‌ వేళలో తనకు తెలియకుండానే ఎంతోమందికి కొండంత అండగా నిలబడటం విశేషం.

ఎదురుచూపులు..
లాక్‌డౌన్‌ ఒక గడ్డుకాలం. చాలామంది తాము పడుతున్న బాధలను పంటిబిగువున భరిస్తున్నారు. బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు షహనాజ్‌. వాళ్ల అవసరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఒక కుటుంబానికి సరిపడా బియ్యం, అవసరమైన వాళ్లకు మందులు, వంటనూనె,  పప్పులు సహా ఇతర అన్ని రకాల నిత్యావసర వస్తువులను స్వయంగా అందజేస్తున్నారు. ‘అదంతా ఎంతో సహజంగా అనిపిస్తుంది. చాలాకాలంగా తెలిసిన అమ్మాయి, ఎంతో దగ్గరి బంధువు వచ్చి ఆదుకుంటున్నట్లుగానే ఉంటోంది. కానీ ఎవరో దాత వచ్చి ఉదారంగా చేసే సహాయంలా అనిపించదు. ఆమె సహాయం ఎప్పటికీ మరిచిపోలేం..’ బోరబండకు చెందిన ఒక మహిళ అభిప్రాయం ఇది. ఆకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో షాపింగ్‌మాల్‌లో చేస్తున్న ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఇంటి కిరాయి, నిత్యావసర వస్తువులు, ఇద్దరు పిల్లల పోషణ భారంగా మారాయి.

ఆ విషయం తెలిసిన షహనాజ్‌ ఇతోధిక సహాయాన్ని అందజేశారు. ‘నెలకు పది, పన్నెండు వేల జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చే వాళ్లు ఆకస్మాత్తుగా ఆ ఒక్క ఆధారాన్ని కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. ఒకప్పుడు మా నాన్నకు వచ్చే రూ.8 వేల జీతంతో మేం బతికాం. అందుకే బాధలను బయటకు చెప్పుకోలేని వారికి నా వల్ల ఏ కొంచెం ఊరట లభించినా చాలనిపిస్తోంది.’ అని అంటారామె.. ఇప్పటి వరకు ఆమె 500 కుటుంబాలకు పైగా సహాయం చేశారు. బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు అవసమైన వారికి మందులు కొనిచ్చారు. ఇక అప్పటికప్పుడు ఆకలి తీర్చేందుకు బంజారాహిల్స్‌లో రోడ్‌ నెంబర్‌–12లో ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారంలో కనీసం 300 మందికి పైగా ఇక్కడ భోజనాలు లభిస్తాయి. ‘ఆమె కోసం ఎదురు చూస్తాం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఆమె వస్తారు. కడుపు నిండా తింటున్నాం. నెల రోజులుగా ఇలాగే గడిచిపోతోంది.’ మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన ఒక క్యాబ్‌డ్రైవర్‌ సంతృప్తి ఇది. బాధితులను, నిస్సహాయులను గురించి స్వయంగా తెలుసుకొని కావాల్సిన సహాయాన్ని అందజేస్తున్నారు. 

మరిన్ని వార్తలు