'రాత్రి జరిగింది ఊహించని ఘటన'

2 Aug, 2014 10:46 IST|Sakshi
'రాత్రి జరిగింది ఊహించని ఘటన'

హైదరాబాద్ : శామీర్పేట వద్ద గతరాత్రి జరిగింది ఊహించని ఘటన అని సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసులపై దొంగల ముఠా కత్తులతో దాడి చేసిన విషయం తెలిసిందే. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని ఆయన శనివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ దొంగలు కత్తులతో దాడి చేసినా పోలీసులు తెగువ చూసించారని ప్రశంసించారు.

మరణించిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతదేహాన్ని అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. గాయపడ్డ ఎస్ఐ వెంకటరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. రాత్రి పోలీసులపై దాడి చేసింది సిద్ధిపేట యల్లం గౌడ్ గ్యాంగేనని సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

 

ఈ ముఠాకు చెందిన ఎల్లంగౌడ్, శ్రీకాంత్ పరారీలో ఉన్నారని, రఘు, నందులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించింది ముజఫర్గా సీవీ ఆనంద్ తెలిపారు. శామీర్ పేట ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన శివారు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామని  స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు