సిబ్బంది అప్రమత్తత ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

4 Mar, 2018 09:34 IST|Sakshi
సిటీలింక్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : అత్యవసరంగా ల్యాండై, ఇంధనాన్ని నింపుకొని తిరిగి బయలుదేరిన ఆ విమానం ఈ పాటికి పెను ప్రమాదంలో చిక్కుకొనిఉండేది. శంషాబాద్‌ విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తతతో ఆ ముప్పుతప్పినట్లైంది. అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

చౌకవిమానయాన సంస్థ సిటీలింక్‌కు చెందిన విమానం ఒకటి ఆదివారం ఉదయం జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి జకార్తా(ఇండోనేషియా)కు బయలుదేరింది. అయితే, మార్గం మధ్యలోనే ఇంధనం నిండుకోవడంతో పైలట్‌ దాన్ని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అప్పటింకే సిద్ధంగా ఉన్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. సిటీలింక్‌ విమానంలో ఇంధనాన్ని నింపారు. ఇక అది టేకాఫ్‌ కోసం రన్‌వేపైకి కూడా వెళ్లింది. అంతలోనే ఇంధనం లీకవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. అంతే, క్షణం ఆలస్యం కాకుండా విమానాన్ని నిలిపేయాలని పైలట్‌కు ఆదేశాలు వెళ్లాయి.

కలకలం : ఎండకు సైతం భగభగమండే గుణమున్న విమాన ఇంధనం.. రన్‌వేపై ధారలా కారిపోవడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కలకలం చెలరేగింది. తక్షణమే ఫైరింజన్లను రప్పించి, రన్‌వే మొత్తాన్ని శుభ్రంగా కడిగేశారు. సాకేతిక నిపుణులు విమానంలో లీకేజీ లోపాన్ని సరిచేశారు. ఒకవేళ ఆ విమానం టేకాఫై ఉంటేగనుక పెనుప్రమాదమే జరిగి ఉండేదని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు