కొత్త సందేశాలకు వేదికలవుతున్న లగ్నపత్రికలు

19 Feb, 2019 05:35 IST|Sakshi

వెడ్డింగ్‌ కార్డులపై రాజకీయ ప్రచారానికి శ్రీకారం  

మోదీకి ఓటేయాలంటూ అభ్యర్థించిన శంషాబాద్‌ వాసి

తాజాగా దేశవ్యాప్తంగా మొదలైన కొత్త ట్రెండ్‌

ఒకప్పుడు పెళ్లి పత్రిక అంటే వ్యక్తిగత విషయంగా ఉండేది. ఇప్పుడది పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటోంది. సామాజిక సందేశాలతో పెళ్లి పత్రికలు కొత్తబాట పట్టాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయపరమైన ప్రచార హోరులోనూ అవి భాగమవుతుండడం విశేషం.   

సాక్షి, సిటీబ్యూరో   :మీ రాక మా కోరిక. మాకు ఆనందదాయకం అనీ, కానుకలు వద్దు.. మీరు రావడమే మాకు సంతోషం. వధూవరులకు ఆశీర్వచనాలివ్వండి లాంటి విన్నపాల స్థానంలో ఇప్పుడు ఫలానా పార్టీకి ఓటేయండి అంటూ అభ్యర్థనలు చోటు చేసుకుంటున్నాయి. ‘అవును నేను మోదీ భక్తుణ్నే’ అని సగర్వంగా చెబుతున్నారు శంషాబాద్‌ నివాసి వై.ముఖేష్‌రావు (27). మహాత్మా గాంధీ తర్వాత మోదీ మాత్రమే అంత గొప్ప నేత అని నిస్సందేహంగా విశ్వసించే ముఖేష్‌.. ఆ విశ్వాసాన్ని చూపించడంలో అందరికంటే వినూత్నమైన దారిని ఎంచుకున్నారు.  

కానుకలొద్దు..ఓటే ముద్దు..
అని అభ్యర్థిస్తున్నారు ముఖేష్‌. తన పెళ్లికి వచ్చేవారెవరూ ఎటువంటి కానుకలూ తేవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ప్రధాని మోదీకి మద్దతుగా ఓటేయడమే తమకు అతిథులు ఇచ్చే కానుక అంటూ ఆయన త్వరలో జరగనున్న తన పెళ్లి పత్రికపై ముద్రించడం విశేషం. ‘పెళ్లి పత్రిక ద్వారా ఓటు వేయమని అడగడం గురించి మొదట్లో మా బంధుమిత్రులు అభ్యంతరం పెట్టారు. నేను వాళ్లని కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది’ అంటారు ముఖేష్‌. మనం రోజువారీ జీవితపు హడావుడిలో పడి దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నా ప్రజల పురోభివృద్ధికి పనిచేస్తున్న నేతకు మద్దతు తెలపడం మన కనీస బాధ్యత అంటున్నారీ మోదీ భక్తుడు.  

దేశవ్యాప్తంగానూ..
పెళ్లి పత్రికలు సామాజిక సందేశాలను మోసుకురావడమనేది కొంతకాలంగా ఉందని బల్కంపేటలోని వెంకటరమణ గ్రాఫిక్స్‌కు నిర్వాహకులు వి.వి.గిరి చెప్పారు. ఆహారాన్ని వృథా చేయొద్దనీ, కొంతమంది మొక్కలు పెంచమని పర్యావరణానికి మద్దతుగా, కొన్ని పత్రికల్లో స్వచ్ఛభారత్‌ను ప్రోత్సహిస్తూ కొంత మంది క్లయింట్లు వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ చేయమని అడుగుతుంటారని ఆయన చెప్పారు. అయితే రాజకీయ పార్టీల ప్రచారం గురించి ఇప్పటిదాకా తమను ఎవరూ సంప్రదించలేదన్నారు.

పెళ్లి పత్రికలు పార్టీల ప్రచార మార్గాలు కావడమనేది తాజాగా మొదలైన ట్రెండ్‌. ఇటీవలే దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. జైపూర్‌కి చెందిన భన్వర్‌లాల్‌ గత జనవరి 22న కుమార్తె పెళ్లి పత్రికలో బేటీ బచావో, బేటీ పడావో అంటూ సందేశాన్ని ప్రచురించి దాంతోపాటే రానున్న ఎన్నికల్లో మోదీకి ఓటేయమంటూ అభ్యర్థనను ముద్రించడం మీడియాను ఆకర్షించింది. అలాగే గుజరాత్‌కి చెందిన ఓ పెళ్లి ఆహ్వాన పత్రికలో కూడా ఇలాంటి అభ్యర్థనే చోటుచేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. అలాగే మరో వెడ్డింగ్‌ కార్డ్‌ మీద రాఫేల్‌ డీల్‌కు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీని తప్పుబడుతూ, మోదీకి మద్దతుగా జరిగిన ప్రచారం కూడా సంచలనం సృష్టించింది.

మరిన్ని వార్తలు