శ్రీకాంతాచారి త్యాగాన్ని అవమానిస్తున్నారు 

3 Jun, 2018 01:30 IST|Sakshi
వేదికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

  రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మండిపడ్డ శంకరమ్మ 

  సన్మానానికి చివరిగా పిలిచి అవమానించారని ఆగ్రహం  

సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆగ్రహించారు. తన కుమారుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని యాదాద్రి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ‘అమరవీరులను స్మరించకుండానే సమావేశాన్ని నిర్వహిస్తారా? సన్మానం కోసం నన్ను చివరగా పిల్చి అవమానిస్తారా?’ అంటూ స్టేజీపై నుంచి దిగిపోతుంటే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతులు నాయక్‌ వెళ్లి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి తప్పు జరగకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత.. శాలువా, పూలదండతో ఆమెను సన్మానించారు. కాగా, శంకరమ్మ స్టేజీపైనే శాలువాను వదిలేసి ఆగ్రహంతో వెళ్లిపోయారు. తర్వాత అక్కడ ఉన్న విలేకరులతో ఆమె మాట్లాడుతూ ‘నల్ల గొండ జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఏ సమావేశం నిర్వహించినా శ్రీకాంతాచారి పేరు జిల్లాలో ఎక్కడా ఎత్తడం లేదు. నా బిడ్డ త్యాగం మట్టిలో కలిసిందా.. 4 కోట్ల ప్రజలకు తన మాంసాన్ని నూనె చేసిండు.. నరాన్ని ఒత్తి చేసిండు.. ప్రజల్లో ఉద్యమం లేపింది శ్రీకాంతాచారి’అని పేర్కొన్నారు. తమకు లక్షలు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, అమరుల కుటుంబాలను గౌరవించినప్పుడే వారి ఆత్మకు శాంతి ఉంటుందని అన్నారు. ‘గతేడాది నేను భువనగిరికి రాను అన్న.. అయినా రమ్మన్నారు. వస్తే చివరగా పిలిచి సన్మానం చేశారు.

ఈ సారి కూడా నేను రాను అనుకున్నా. కచ్చితంగా రావాలని పిలిస్తే వచ్చాను. అందర్నీ పిలిచిన తర్వాత ఆఖరున శ్రీకాంతాచారి తల్లి అని పిలిచారు. శ్రీకాంతాచారి నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకొని అమ్మా.. నాన్నా అనకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చాడు. ఇవాళ బిడ్డ చావుకు అర్థం లేకుండా పోతుంది. అమరవీరుడి తల్లిని ఇలా అవమాన పరుస్తారా’అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ తన బిడ్డ వర్ధంతిని ఘనంగా నిర్వహించారని వివరించారు. అలాగే పొడిచేడులో మంత్రి హరీశ్‌రావు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని,. శ్రీకాంతాచారి గౌరవం సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తెలుసని, కానీ కింది స్థాయిలో ఉన్న జిల్లా నాయకులకు తెలియడం లేదని అన్నారు.   

మరిన్ని వార్తలు