స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడాలి 

28 Jan, 2019 01:15 IST|Sakshi
అంబేడ్కర్‌ కళాశాలలో జరిగిన సదస్సుకు హాజరైన ప్రొఫెసర్‌ శాంతాసిన్హా , మల్లు స్వరాజ్యం తదితరులు

మహిళలుగా మనల్ని మనం గౌరవించుకోవాలి  

శతకోటి ప్రజాగళం సదస్సులో శాంతాసిన్హా 

హైదరాబాద్‌: మహిళలు స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని జాతీయ బాలల హక్కుల మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ శాంతాసిన్హా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించినప్పటికీ సమాజంలో నేటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాగ్‌లింగంపల్లి అంబేడ్కర్‌ కళాశాలలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఆదివారం జరిగిన ‘శతకోటి ప్రజాగళం’ సదస్సులో పాల్గొని ఆమె మాట్లాడారు. మహిళలపై వివక్ష అనేది ఆంక్షల పేరుతో ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు. మహిళల వివక్ష పట్ల సమాజంలోని ఆలోచన విధానంలోనే మార్పు రావాలన్నారు. పోరాడితేనే మహిళలకు హక్కులువచ్చాయని గుర్తుచేశారు. మహిళగా మనల్ని మనం గౌరవించుకోవాలన్నారు.  

మహిళలపై దాడులు పెరిగాయి 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై దాడులు, హింస పెరిగిపోయాయని ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు స్వరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ï శబరిమలలో స్త్రీలకు ప్రవేశం లేదనటం వివక్ష కాదా అని ప్రశ్నించారు. హింస, వివక్షతకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అంబేడ్కర్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, రచయిత కె.విమల, ఐద్వా నాయకులు మల్లు లక్ష్మి, హైమావతి, భూమిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి, అమన్‌ వేదిక, రెయిన్‌బో హోమ్స్, అంకురం, అప్సా, భూమిక ఉమెన్‌ కలెక్టీవ్, వివిధ సచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు