అశ్రునయనాల మధ్య శరత్‌ అంత్యక్రియలు

13 Jul, 2018 02:41 IST|Sakshi

అమెరికా నుంచి వరంగల్‌కు చేరిన మృతదేహం

కరీమాబాద్‌: అమెరికాలోని కెన్సాస్‌లో జూలై 7న దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కొప్పు శరత్‌(26) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య గురువారం ముగిశాయి. గురువారం ఉదయం శరత్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో వరంగల్‌ కరీమాబాద్‌లోని స్వగృహానికి తీసుకొచ్చారు.

భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో పొరుగు దేశానికి వెళ్లిన కుమారుడు ఊహించని రీతిలో విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతి, సోదరి అక్షర గుండెలవిసేలా రోదించారు. మధ్యాహ్నం కాశికుంటలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.  

శరత్‌ కుటుంబానికి అండగా ఉంటాం: కడియం  
శరత్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శరత్‌ మృతదేహానికి వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. శరత్‌ తల్లిదండ్రులను ఓదార్చారు. శరత్‌ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి మాలతి ఐదు రోజులుగా అన్నం తినకుండా విలపిస్తోందని, ఆమె ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యులు, అంబులెన్స్‌ ఏర్పాటు చేసి ఐవీ ప్లూయిడ్స్‌ ఇస్తున్నట్లు కడియం చెప్పారు. పర్వతగిరి మండలంలో ఈవోపీఆర్‌డీ గా పనిచేస్తున్న మాలతికి హైదరాబాద్‌ జీడబ్ల్యూఎంసీలో ఉద్యోగం కల్పిస్తామని, భార్యాభర్తలు హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు