పోలవరంలో తెలంగాణకు వాటా

5 Jun, 2014 01:29 IST|Sakshi
పోలవరంలో తెలంగాణకు వాటా
  • నీరే కాదు విద్యుత్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి వాటా
  •   జల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ
  •   {పత్యేక అథారిటీలోనూ భాగస్వామ్యం
  •   తెలంగాణకు వాటాను వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్
  •   దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం
  •  
     ఉపయోగంలోకి వచ్చే నీరు 303 టీఎంసీలు
     సాగు నీరు 7.20 లక్షల ఎకరాలకు (ప.గోదావరి)
     వరదలప్పుడు పంచుకోవాల్సిన నీరు 45 టీఎంసీలు
     ఉత్పత్తి అయ్యే విద్యుత్ 960 మెగావాట్లు 
     (కేంద్రం తాజా నోటిఫికేషన్‌తో నీటితోపాటు విద్యుత్‌నూ తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచుకోవాల్సి వస్తుంది)
     
     సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో నీటితోపాటు విద్యుత్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్, నీరు ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద ఈ ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. దీనికి జాతీయహోదా కల్పించిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్యదర్శి (ఐఏఎస్)ని సభ్యుడిగా చేర్చాలని నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా ఇందులో కూడా తెలంగాణకు భాగం ఉంటుందని పేర్కొంది. నీటి విషయంలో ఇప్పటికే తెలంగాణకు కోటా కల్పించారు. దీంతో నీటిని కూడా రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ద్వారా సుమారు 303 టీఎంసీల గోదావరి నీరు ఉపయోగంలోకి రానుండగా, పశ్చిమగోదావరి జిల్లాలోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. విశాఖపట్నం తాగునీటి అవసరాలకు, పరిశ్రమల కోసం ఈ నీటిని తరలించాల్సి ఉంది. వరదలు వచ్చే సమయంలో 80 టీఎంసీల నీటిని ఇటు కృష్ణా బేసిన్‌కు అందించాల్సి ఉంది. ఈ 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు తెలంగాణ, సీమాంధ్రలు కలిసిన ఉమ్మడి రాష్ట్రానికి, మిగిలిన 35 టీఎంసీల నీటిని ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినందున ఈ 45 టీఎంసీలను కూడా ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పైన పేర్కొన్న అంశాలను చేర్చినట్టు సమాచారం.
     
     నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తోన్న ప్రభుత్వం
     
     పోలవరంలో తెలంగాణకు వాటా ఇవ్వాలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంతో పాటు ముంపు ప్రాంతాలు, ఆయకట్టు కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉండగా.. తెలంగాణకు వాటా ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని రాష్ట్ర అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) బుధవారం సదరు లేఖను ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించినట్టు సమాచారం. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించిన తర్వాత దానిని కేంద్రానికి పంపించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని సుమారు 208 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఈ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కలుపుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నారు.
మరిన్ని వార్తలు