ప్రేమించాడు ... పెళ్లి చేసుకున్నాడు ... బస్టాండ్‌లో...

5 Aug, 2014 13:47 IST|Sakshi
ప్రేమించాడు ... పెళ్లి చేసుకున్నాడు ... బస్టాండ్‌లో...

నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) :  ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత నిజామాబాద్ తీసుకెళ్లి బస్టాండ్‌లో వదిలేసి వచ్చాడు. దీంతో చావాలనుకున్నా. పోలీసులు కాపాడారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కలిగోట్‌కు చెందిన శిరీష. సోమవారం భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలిగోట్ గ్రామానికి చెందిన నాయిక అశ్వంత్ , మెతుకు శిరీష చిన్నప్పటినుంచి క్లాస్‌మెట్స్. పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, ఇంటర్ నిజామాబాద్‌లోని కాకతీయ కళాశాలలో కలిసి చదివారు. జిల్లా కేంద్రంలో వేరువేరు కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరారు.
 
 వీరి మధ్య పదో తరగతిలోనే ప్రేమ అంకురించింది. ఏడాదిన్నరక్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లోనుంచి పారిపోయారు. అయితే అశ్వంత్‌కు 20 ఏళ్లే ఉండడంతో అప్పట్లో ఆలయ పూజారులు పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో వెనుదిరిగి వచ్చారు. 2013 మేలో శిరీషకు కుటుంబ సభ్యులు బంధువుతో పెళ్లి చేశారు. ఆమె భర్తకు అశ్వంత్ తరచూ ఫోన్ చేసి తమ ప్రేమ వ్యవహారం చెప్పేవాడు. ఆమె లేకుండా బతకలేనని పేర్కొనేవాడు. దీంతో పెళ్లైన నెలలోపే శిరీషకు విడాకులయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో అశ్వంత్ శిరీషను ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి తీసుకొని వెళ్లి స్నేహితుల సమక్షం లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కలిగోట్ వెళ్లారు.
 
కొంతకాలం కలిసి బాగానే ఉన్నామని, అయితే కట్నం తీసుకుని రమ్మంటూ అత్తమామలు వేధించేవారని శిరీష తెలిపింది. వారం క్రితం బైక్‌పై నిజామాబా ద్ తీసుకొని వచ్చాడని, తనను బస్టాండ్‌లో ఉండమని చెప్పి వెళ్లిపోయాడని పేర్కొంది. ఎంతకీ రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ అని వచ్చిందని తెలిపింది. దీంతో మోసం చేశాడని గ్రహించానని, చావాలనుకొని బాసరకు వెళ్లానని పేర్కొంది.
 
అక్కడ నది ఒడ్డున ఆలోచిస్తూ నిల్చొని ఉండగా పోలీసులు వచ్చారని, విషయం తెలుసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లి జక్రాన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. భర్త మంచివాడేనని, అత్తమామలు మనసు మార్చి ఉంటారని పేర్కొంది. అత్తమామలు నాయిక గంగామణి, రాజన్నలపై పోలీసులకు ఫిర్యాదు చేశానంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నానని తెలిపింది. విషయం తెలుసుకున్న లోక్‌సత్తా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏకే లత బాధితురాలికి మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు