వేధించే ‘ప్రేమ’లు!

14 Feb, 2020 08:21 IST|Sakshi
కౌన్సెలింగ్‌ ఇస్తున్న షీ టీం సిబ్బంది (ఫైల్‌)

వాలెంటైన్స్‌ డే స్పెషల్‌

షీ బృందాల ద్వారా నమోదు చేస్తున్న కేసుల్లో సగం ఇవే..

ప్రతినెలా 125 కేసుల్లో 63 కేసులు ప్రేమ వేధింపులే..

పరిచయస్తుల నుంచి అపరిచితుల వరకు ఆకతాయిలు  

వేధింపులకు వేదికగా వాట్సాప్‌లు, సామాజిక మాధ్యమాలు    

చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు

సాక్షి, సిటీబ్యూరో: ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మహిళను షాద్‌నగర్‌ మండలం కామ్‌సన్‌పల్లి గ్రామానికి చెందిన బాలరాజు ప్రతిరోజూ ఫాలో అవుతున్నాడు. బస్టాప్, పాఠశాల ప్రాంగణంలో ప్రత్యక్షమవుతూ తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంలో బాలరాజును హెచ్చరించారు. అయినా బాలరాజు తన తీరును మార్చుకోకపోవడంతో ఒత్తిడికి గురైన బాధితురాలు షాద్‌నగర్‌ షీ బృంద సభ్యులను సంప్రదించారు. ఆ వెంటనే బాలరాజు బాధితురాలి వెంటపడుతున్న సమయంలో మఫ్టీలో ఉన్న షీ బృంద సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదుచేయించి జైలుకు పంపించారు.  

ఇది గత నెలలో షీ బృందం దృష్టికి వచ్చిన ఓ కేసు మాత్రమే. ఇలాంటివి ప్రతి నెలా సైబరాబాద్, రాచకొండ షీ బృంద సభ్యులకు వచ్చే దాదాపు 500 ఫిర్యాదుల్లో 125 కేసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేస్తున్నారు. ఈ కేసుల్లో సగానికి సగం ప్రేమించమంటూ చేసే వేధింపులే ఎక్కువగా ఉన్నాయని షీ బృంద గణాంకాలు చెబుతున్నాయి. అంటే 63 కేసులు ‘లవ్‌ వేధింపు’లే ఉన్నాయని ఆయా ఈవ్‌టీజర్లను కౌన్సెలింగ్‌ చేస్తున్న సభ్యులు చెబుతున్నారు. 

ప్రేమించకుంటే ఎందాకైనా..
పాఠశాలలో పరిచయం.. కళాశాలలో స్నేహం.. ఉద్యోగంలో చేసే ప్రాంతంలో పరిచయం, జర్నీ చేసే సమయంలో జరిగిన పరిచయం.. ఇలా ఏదో ఒక చోట జరిగిన పరిచయంతో విద్యార్థినుల నుంచి మొదలుకొని మహిళల వెంటపడుతున్న ఈవ్‌టీజర్లు పెరుగుతున్నారు. ఏదో రకంగా వారి సెల్‌ఫోన్‌ నంబర్లను దొరకబుచ్చుకుంటున్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...మీరు కూడా నన్ను ప్రేమించండి అంటూ ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. వాట్సాప్‌ పోస్టులతో పాటు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. లేకుంటే వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని మార్ఫింగ్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలను మీ మిత్రులకు పంపిస్తామని, మీ కుటుంబ సభ్యులందరికీ వాట్సాప్‌ లేదంటే సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. చివరకు ప్రేమ అవసరం లేదు. తమతో గడపాలనే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ ఈవ్‌టీజర్లతో చాలామంది పెళ్లిళ్లు కూడా జరగకుండా నిలిచిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ఆకతాయిల వేధింపులు తారస్థాయికి చేరడంతో షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగుతున్న షీ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపిస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుంచి ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ వస్తే యాక్సెప్ట్‌ చేయవద్దు. మీ ఫేస్‌బుక్‌ ఖాతాలకు ప్రైవేట్‌ సెట్టింగ్స్‌ పెట్టుకుంటే మంచిది. ఎక్కడో ఒక చోట జరిగిన పరిచయంతో ఆకతాయిలు వెంటపడుతూ వేధిస్తుంటే షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’ని సైబరాబాద్‌ షీటీమ్‌ ఇన్‌చార్జ్‌ అనసూయ తెలిపారు. 

మరిన్ని వార్తలు