పోకిరి మారట్లే!

5 Dec, 2019 08:40 IST|Sakshi

గత 11 నెలల్లో 1247 మంది ఆకతాయిల ఆగడాలు

835 మందికి జైలు శిక్ష, ట్రయల్స్‌లో 404 మంది

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ‘షీ’టీమ్స్‌ దాడులు  

పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన  

సాక్షి,సిటీబ్యూరో: నూనూగు మీసాలు రాని కుర్రాడు బాలికను అటకాయిస్తున్నాడు..విచ్చలవిడిగా తిరుగుతూ కంటి చూపుతో ఇబ్బంది పెడుతున్నాడు. ఒకేచోట పనిచేస్తున్న సహోద్యోగినిని ఫాలో అవుతూ పురుషులు వేధిస్తున్నారు.. జుట్టు నెరిసి.. వయసు మళ్లిన ఇంకొందరు పెద్దమనుషులు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వికృతంగా ప్రవర్తిస్తున్నారు. భయపడి కొందరు.. ఎవరికీ చెప్పుకోలేక ఎందరో మహిళలు,  యువతులు, బాలికలు వేధింపులను మౌనంగానే భరిస్తున్నారు.

కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా ఈ ఏడాది 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,247 మంది ఈవ్‌ టీజర్లను షీ బృందాలు పట్టుకున్నాయి. అంటే నెలకు సగటున 113 వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓవైపు ఆకతాయిల ఆట కట్టిస్తున్న షీ బృందాలు ఇటు బాలికలు, అటు బాలురకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఆపద, వేధింపులు ఎదురైనప్పుడు ఏం చేయాలన్న దానిపై బాలికలు స్పష్టత ఇస్తూనే.. అమ్మాయిలను వేధిస్తే కుర్రాళ్ల కెరీర్‌ ఎలా పాడైపోతుందో.. సమాజంలో ఎంత చులకనగా మారిపోతారో చెబుతూ పోలీసులు సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 11 నెలల్లో రెండు కమిషనరేట్లలో నాలుగు వేలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి 6 లక్షల మందిని జాగృతి చేశారు. 

ఈవ్‌ టీజర్లకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న పోలీసులు
ఫోన్‌తోనే పట్టించేస్తున్నారు..
బస్టాప్‌లు, ఆటో స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు.. ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. పోలీసు స్టేషన్లలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మెయిల్, హాక్‌ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని యువతులను చైతన్యం చేస్తున్న తీరు బాగానే పనిచేస్తోంది. ఇందుకనుగుణంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్‌ 100 ద్వారా మహిళల ఫిర్యాదుల శాతం పెరిగింది. అయితే ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీలో రంగంలోకి దిగుతున్న షీ బృందాలు అక్కడికి చేరుకొని ఆకతాయిల వెకిలి చేష్టలను వీడియో తీసి సాక్ష్యాలతో కోర్టుకు సమర్పిస్తుండడంతో నిందితులు కటకటాలపాలవుతున్నారు. 

మేజర్లు, మైనర్లు కూడా.. 

జంట కమిషనరేట్లలో ఇప్పటి దాకా షీ బృందాలకు చిక్కివారిలో ఎక్కువగా 1,057 మంది మేజర్లుంటే, 190 మంది మైనర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి సమాజంలోని స్త్రీల పట్ల గౌరవం పెంచేలా తలిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం వల్లనే ఆకతాయిలుగా మారుతున్నారని షీ బృందం ఇచ్చే కౌన్సెలింగ్‌లో తేటతెల్లమవుతోంది. వయసుల వారీగా పరిశీలిస్తే ఎక్కువగా కౌమార దశలో ఉన్న విద్యార్థులు, యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మనవడు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సీనియర్‌ సిటిజన్లు కూడా మహిళలను వేధించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని పోలీసులు, కౌన్సిలర్లు అంటున్నారు.

ఆ కుటుంబాల పిల్లలే ఎక్కువ
యువతులను వేధిస్తూ షీ బృందాలకు పట్టుబడుతున్నవారిలో ఎక్కువగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లోని పిల్లలే ఉంటున్నారు. పిల్లలపై వీరి పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో దారి తప్పుతున్నారని కౌన్సిలింగ్‌లో గుర్తిస్తున్నారు. ఉదయం పిల్లలను స్కూలు, కాలేజీలకు పంపిన తర్వాత విధులకు వెళ్లే భార్యాభర్తలు.. తిరిగి వచ్చేసరికి రాత్రి దాటుతోంది. ఈ మధ్య పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. సెల్‌ఫోన్‌తో ఏం చేస్తున్నారనే విషయాలు కన్నవారు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఆ తరహా పిల్లలు ఈవ్‌ టీజర్లుగా మారుతున్నారు. ఇటువంటి కుటుంబాలు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.– అనసూయ,సైబరాబాద్‌ షీ–టీమ్స్‌ ఇన్‌చార్జి 

మరిన్ని వార్తలు