ప్రచారం... సమాచారం... పనితీరు

28 Oct, 2015 23:50 IST|Sakshi
ప్రచారం... సమాచారం... పనితీరు

సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక బృందాల ఏర్పాటుపై విస్తృత ప్రచారం... ప్రజలు, బాధితుల ఇస్తున్న సమాచారం... తక్షణం స్పందిస్తున్న సిబ్బంది పనితీరు... ఈ మూడింటి కారణంగానే నగరంలో ఏర్పాటైన ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి మూలమయ్యాయని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా అన్నారు. ఈ బృందాలు అందుబాటులోకి వచ్చిశనివారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ...

‘ఏడాదిలో ‘షీ-టీమ్స్’కు వివిధ మాధ్యమాల ద్వారా 883 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా 573 ‘డయల్-100’ ద్వారా వచ్చినవే. ప్రతి ఫిర్యాదు పైనా తక్షణం స్పందించేందుకు నగర వ్యాప్తంగా మొత్తం 100 బృందాలు షిఫ్టుల వారీగా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా పోలీసుస్టేషన్లలోనూ కొన్ని టీమ్స్ ఉన్నాయి. కేసు తీరును బట్టి కౌన్సెలింగ్ నుంచి నిర్భయ చట్టం కింద కేసుల వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ‘షీ-టీమ్స్’ పనితీరుతో పాటు మహిళలు/యువతుల భద్రతపై కరపత్రాలు, లఘు చిత్రాల ద్వారా భారీ ప్రచారం చేపట్టనున్నాం.
 
అన్ని వయస్సుల వారు, స్వచ్ఛంద సంస్థలతో పాటు మారిన పోకిరీలను వాలెంటీర్లుగా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. బంగారు తెలంగాణ సాధనలో ‘షీ-టీమ్స్’ పాత్ర కీలకంగా మారనుంది’ అని అన్నారు. ఈ ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు, అదనపు డీసీపీ రంజన్ రతన్ కుమార్, ‘షీ-టీమ్స్’ ఏసీపీ కవితతో పాటు సిబ్బందీ అహర్నిశలు శ్రమించారని స్వాతిలక్రా పేర్కొన్నారు.
 
కౌన్సెలెంగ్ నా కుమారుడిని మార్చింది
‘రోడ్లపై యువతుల్ని వేధిస్తున్న నా కుమారుడిని ‘షీ-టీమ్స్’ అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు. కౌన్సెలింగ్ కోసం నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంలో అధికారులు చెప్పిన మాటలు, ఇంట్లో మేం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నా కుమారుడిలో మార్పు తెచ్చాయి’
- మహ్మద్ హాజీ
 

బృందాలు నలుమూలలా విస్తరించాయి
‘‘షీ-టీమ్స్’ బృందాలు నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. వీటి ఏర్పాటు, విస్తరణ ఓ ఉద్యమంలా సాగింది. ఇబ్బంది ఎదురైనప్పుడు ‘డయల్-100’కు ఫోన్ చేయగానే స్పందిస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాయి.’
- దివ్య, విద్యార్థిని
 
 
నేను ధైర్యంగా తిరుగుతున్నాను..
‘సిటీకి కొత్తగా వచ్చాను. ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలంటే పోకిరీలతో భయం వేసేది. తల్లిదండ్రులూ ఎంతో ఆందోళన చెందే వారు. ‘షీ-టీమ్స్’తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను ధైర్యంగా తిరగడంతో పాటు ఇబ్బందుల్లో వారినీ ఆదుకుంటున్నాను.’
- గాయత్రి, విద్యార్థిని

మరిన్ని వార్తలు