భరోసా!

23 Aug, 2019 11:45 IST|Sakshi

నగరంలో యువతులు, మహిళలకు పూర్తి రక్షణ  

షీ–టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం ఏర్పాటు

‘పోక్సో’ బాధితులకు అండగా చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఓ యువతి ఒంటరిగా నడిచి వెళ్తుంటే వెకిలి చేష్టలతో వేధించే పోకిరీలు.. బస్టాపుల వద్ద కాపుకాసి అసభ్యంగా సైగలు చేసే ఆకతాయిలు.. అవకాశం కల్పించుకుని రెచ్చిపోయే మృగాళ్లు’.నగరంలోని మహిళలు ప్రతి రోజు ఎక్కడోచోట ఎదుర్కొనే సంఘటనలు. ఓ నేర దుర్ఘటనలో బాధితురాలు సహాయం కోసం పోలీస్‌ స్టేషన్, ఆస్పత్రి సహా అనేక ప్రాంతాల చుట్టూతిరుగుతూ విసిగి వేసారిపోవాల్సి వచ్చేది. లైంగిక వేధింపుల బారినపడిన బాల/బాలికలు తమకు న్యాయం జరిగే క్రమంలో పదేపదే అనేక బాధలు పడాల్సిన పరిస్థితి. నగరంలో ఇలాంటి అంశాలు ఇప్పుడు గతం మాత్రమే. పోకిరీల భరతం పట్టే ‘షీ’ బృందాలు, బాధిత మహిళలు/యువతులకు ఆసరాగా నిలిచే ‘భరోసా’ కేంద్రం, ‘పోక్సో’ చట్టం కింద నమోదైన కేసుల విచారణ కోసం ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు’అందుబాటులోకి రావడంతో స్పందన,సహాయ సహకారాలు వెనువెంటనేఅందుతున్నాయి. ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు.. సోషల్‌ మీడియా సందేశం పంపినా షీ–టీమ్స్‌ వచ్చి వాలుతున్నాయి.  

మూడున్నరేళ్ల క్రితం అందుబాటులోకి..
దేశంలోనే తొలిసారి షీ–బృందాల కాన్సెప్ట్‌ 2014 అక్టోబరు 24న హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. మహిళల్ని వేధించే పోకిరీల భరతం పట్టడమే ఈ బృందాల పని. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్‌ విధానం ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్‌ చేసి తర్వాత పట్టుకుని స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ చేస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్‌ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్‌ అవే’ ఆన్‌లైన్‌ సంస్థ గతేడాది సర్వేలో తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్‌ పాత్ర అత్యంత కీలకం. ఇవి ఏర్పాటైన నాటి నుంచీ వాటి పనితీరు, స్పందన తదితరాలపై ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే విషయాన్ని అధికారులు ప్రైవేట్‌ సంస్థలతో సర్వేలు చేయిస్తూ తెలుసుకుంటున్నారు. ఇలా వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా అవసరమైన మార్పు చేస్తున్నారు.  

వీటన్నింటి పైనా ఫిర్యాదులు ఈవ్‌ టీజింగే కాదు..
మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీ–టీమ్స్‌ను ఆశ్రయించవచ్చు. ఫోన్, సోషల్‌మీడియా ద్వారా వేధింపు ఎదురైనా, పని చేస్తున్న ప్రాంతంలో వేధింపులు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తాకాలని చూస్తున్నా/తాకుతున్నా, అనుమతి లేకుండా ఫొటోలు తీసినా, పబ్లిక్‌ ప్లేసులు/వాహనాలపై వెంబడిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నా షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నేరం తీవ్రతను బట్టి బాధ్యులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం నుంచి నిర్భయ కేసు సైతం నమోదు చేస్తున్నారు. నగరంలో షీ–టీమ్స్‌ రాకతో మహిళలపై జరిగే బహిరంగ వేధింపులు తగ్గాయి. దాంతో ఈ తరహా బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మహారాష్ట్ర, చత్తిస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ అమలవుతున్నాయి. వాస్తవానికి షీ–టీమ్స్‌కు డయల్‌–100, నేరుగా వచ్చే ఫిర్యాదులతో పాటు ఈ మెయిల్,  సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువగా వస్తున్నాయి. ఈ బాధితుల్లో అనేక మంది నిందితులపై లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ టీమ్స్‌పై సోషల్‌ మీడియా, పోస్టర్స్, బ్యానర్స్, కరపత్రాలు, మూవీ స్లైడ్స్‌ తదితర మార్గాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లు, ఏరియాల్లోనూ అవగాహన చేపడుతున్నారు. మరోపక్క మహిళలు, యువతులకు స్వీయ రక్షణ కోసం మెళకువులు సైతం నేర్పిస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్లు, మహిళా కండక్టర్లతో వేధింపులు, షీ టీమ్స్‌ గూర్చి అవగాహన కల్పిస్తున్నారు.  

భరోస సేవలు ఇలా..
బాధితుల నుంచి కాల్‌ అందుకున్న వెంటనే సంబంధిత విభాగానికి, కేంద్రానికి ఆ కేసును బదిలీ చేస్తారు. డయల్‌ 100, చైల్డ్‌ హెల్ప్‌ నంబర్‌ 1098కు ఫోన్‌ చేయవచ్చు. హాకా భవన్‌లోని కేంద్రంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  
లైంగిక దాడులు, పోక్సో కేసులలో బాధితులకు అత్యవసరమైన సేవలు అందిస్తారు. తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసు నమోదు చేసి, కేసు విచారణను భరోసా కేంద్రం నుంచి దర్యాప్తు చేస్తారు. బాధితుకుల అవసరమైన న్యాయ సహాయం, వైద్య సహాయం సైతం అందిస్తారు.  
అఘాయిత్యాల్లో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి తిరిగి కోలుకునేలా కౌన్సిలింగ్‌ను ఇస్తున్నారు. వారు కోలుకున్నాక ఉపాధిపై అంశాల్లో శిక్షణనిచ్చి పునరావస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
తర్వాత వారికి ఉద్యోగం, స్వయం ఉపాధికి సహాయం అందిస్తున్నారు.  

అఘాయిత్యాల బారిన పడి, ఆపదలో ఉన్న చిన్నారులు, యువతులు, మహిళలకు హైదరాబాద్‌ పోలీసులు మేమున్నాం అంటూ ‘భరోసా’ కల్పిస్తున్నారు. 2016 మే 7న నాంపల్లి హాకా భవన్‌లో ఏర్పాటైన ఈ కేంద్రం ఆధీనంలోనే ప్రస్తుతం షీ–టీమ్స్‌ కూడా పనిచేస్తున్నాయి. అఘాయిత్యాలకు గురైన వారికి పోలీసు–న్యాయ–వైద్య సహాయాలతో పాటు పునరావాసం కూడా అందిస్తున్నారు. ఈ కేంద్రంలో పోలీసుల ప్రమేయం చాలా తక్కువ. గృహ హింసకు గురయ్యే మహిళలు కూడా ఇక్కడకు వస్తున్నారు. వారి కుటుంబాల్లో సమస్యను తెలుసుకొని, కుటుంబాన్ని కలిపేందుకు కౌన్సిలింగ్‌ వ్యవస్థ పనిచేస్తోంది. మద్యానికి బానిసలైన భర్తలు, భార్యలను వేధిస్తూ కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇక్కడ భరోసా కేంద్రం 24 గంటలూ పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కొందరు భరోసా కేంద్రానికి రాలేని వారుంటే వారివద్దకే వెళ్లి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. భరోసా కేంద్రానికి ప్రతి నెల వచ్చే అత్యవసర కాల్స్‌ పెరుగుతున్నాయి. నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన అత్యాచారం, చిన్నారులపై అఘాయిత్యాల కేసులు ఇక్కడికే బదిలీ అవుతాయి. బాధితుల నుంచి మహిళా అధికారులే వాంగ్మూలం తీసుకుంటారు. బాధితుల్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయిస్తారు. అది సాధ్యం కాకుంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులే ఈ కేంద్రానికి వచ్చి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు.  

చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టుతో మేలు  
దేశంలో తొలిసారిగా ‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్యువల్‌ అఫెన్సెస్‌’ (పోక్సో) యాక్ట్‌ కింద నమోదయ్యే కేసుల్ని విచారించడానికి హాకా భవన్‌లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టును  ఏర్పాటు చేశారు. దీంతో పోక్సో యాక్ట్‌ కేసుల విచారణ వేగవంతమైంది. సరాసరిన కనిష్టంగా 85 రోజుల్లో ట్రయల్‌ పూర్తి చేస్తూ చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు రికార్డు సృష్టిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో భరోస కేంద్రానికి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం హైకోర్టు ఈ న్యాయస్థానం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అదనపు మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టుగా ఉండే ఈ న్యాయస్థానం ద్వారా పోక్సో యాక్ట్‌ కేసుల విచారణ వేగవంతమైంది.

ఫోన్‌: 100
వాట్సాప్‌: 94906 16555
ఫేస్‌బుక్‌:  hydsheteam@gmail.com
యాప్‌:  HAWK EYE
ట్విట్టర్‌:  hydsheteams

మరిన్ని వార్తలు