ఒక్కరోజులోనే అమ్మకానికి!

28 Feb, 2019 08:51 IST|Sakshi
మరికల్‌లో లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తున్న పశు సంవర్ధక శాఖాధికారులు (ఫైల్‌)

పక్కదారి పడుతున్న సబ్సిడీ గొర్రెల పథకం

మరికల్‌లో పంపిణీ.. జడ్చర్లలో పట్టుబడిన వైనం

పంపిణీ చేసిన 24 గంటల్లోపే రీసైక్లింగ్‌ 

మధ్య దళారులకు కాసుల పంట 

నారాయణపేట: రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.75 వేలు వెచ్చించి 21 గొర్రెలను అందిస్తోంది. వీటితో ఆయా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. నారా యణపేట జిల్లాలోని మరికల్‌కు చెందిన గొర్రెల కాపరులకు సోమవారం పశుసంవర్ధకశాఖ అధికారులు 64 యూనిట్లకు గాను లబ్ధిదారులు ఒక్కొక్క యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున అందజేశారు. అయితే కాపరులు గొర్రెలను పొంది ఒకరోజు సైతం తమ వద్ద పెట్టుకోకుండా దళారులతో కుమ్మక్కై బేరం చేసుకోవడంతో వాటిని ప్రత్యేక వాహనంలో నల్లగొండ జిల్లా మల్లెపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల వద్ద పట్టుబడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. 

పక్క రాష్ట్రాల నుంచి.. 
ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మధ్యవర్తి సాయం తీసుకుంటున్నారు. అక్కడే గొర్రెకు పోగువేసి జిల్లాకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చి మరికల్‌లో కాపరులకు అందజేశారు. 

దళారులచే విక్రయాలు 
ప్రభుత్వ సబ్సిడీతో కొనుగోలు చేసిన గొర్రెలను ఎక్కడ పెంచుకుంటాం.. ఒక్కసారే అమ్మితే పోలా అంటూ కాపరులు అధిక సొమ్ముకు ఆశపడి దళారులతో కుమ్మక్కై గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొర్రెలు ఒక్కసారిగా విక్రయాలు చేయడంతో దళారులకు కాసుల పంటనే చెప్పవచ్చు. 64 యూనిట్లు అంటే 1344 గొర్రెలు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున అధికంగా విక్రయించిన రూ.32 లక్షల లాభం వస్తుంది. ఇందులో లబ్ధిదారులకు సగం ఇచ్చినా.. మిగతా సగం దళారుల సొంతమవుతుంది. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

గొర్రెలు అమ్మితే సభ్యత్వం రద్దు 
మరికల్‌ (నారాయణపేట): గొర్రెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అక్రమంగా అమ్మి న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య అన్నారు. మరికల్‌లో డీడీలు కట్టిన వారికి 64 యూనిట్లను మం జూరు చేశామని, ఈ మేరకు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసిన రోజు రాత్రికే చట్టానికి విరుద్ధంగా గొర్రెలను మాచర్ల కొనుగోలుదారులకు అమ్మిన లబ్ధిదారుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామన్నారు. అలాగే ఆ గ్రామాన్ని సైతం బ్లాక్‌ లిస్టులో పెట్టి మిగతా లబ్ధిదారులకు కూడా గొర్రెలను నిలిపివేస్తామన్నారు. దీంతోపాటు సం ఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. పట్టుబడిన గొర్రెలను డీడీలు కట్టిన ఇతర గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తా మన్నారు. అక్రమంగా గొర్రెలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభు త్వ సబ్సిడీ గొర్రెలను దొడ్డిదారిన అమ్మితే ఎంతటి వారైనా సరే కేసులు తప్పవని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు