కాంగ్రెస్‌లో గలాట

12 Feb, 2015 04:35 IST|Sakshi
కాంగ్రెస్‌లో గలాట

టికెట్‌కు డబ్బులు తీసుకున్నారని మొన్న రేణుకపై ఆగ్రహం
మోసం చేశారని మాజీ ఎంపీ బలరాంపై నిన్న రేగా ఫైర్
మణుగూరులో పార్టీ కార్యాలయానికి రాకుండా అడ్డగింత
కాంగ్రెస్‌లో రోజురోజుకూ ముదురుతున్న వర్గపోరు

సాక్షి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న ఎమ్మెల్యే టికెట్ల అగ్గి ఇంకా చల్లారలేదు. పార్టీ అధిష్టానం సయోధ్య కోసం జిల్లాకు పంపే దూతల ముందు నేతలు, కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉండడం గమనార్హం.  వైరా ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తీసుకొని ఎంపీ రేణుకాచౌదరి మోసం చేశారని ప్రముఖ వైద్యులు రాంజీ భార్య చంద్రకళ, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మరువక ముందే తనకు అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరులో మాజీ ఎంపీ పొరికె బలరాంనాయక్‌ను పార్టీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న కాంగ్రెస్ పార్టీలో గలాట ప్రస్తుతం తారస్థాయికి చేరింది.
 
ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు అంశం సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. పార్టీ నేతలంతా ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నించి కొందరు సఫలం కాగా, మరి కొందరికి నిరాశే ఎదురైంది. అప్పటినుంచి జిల్లా పార్టీని ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్, నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని రేణుకాచౌదరి డబ్బులు తీసుకున్నారని డాక్టర్ రాంజీ భార్య, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుకు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.

డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వకపోవడంతోనే మనోవేదనతో రాంజీ మృతిచెందారని వారు రేణుకపై నిప్పు లు చెరిగారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని కొప్పుల రాజు వారికి హామీ ఇవ్వడంతో రేణుకపై ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని నేతల్లో చర్చ జరుగుతోంది. కాగా, జిల్లాలోని రేణుకాచౌదరి వ్యతిరేక వర్గం కూడా ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఏఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
 
షెట్టర్ వేసి అడ్డుకున్న రేగా..

ఈ వివాదం మరువక ముందే బుధవారం మణుగూరులో మాజీ ఎంపీ పొరిక బలరాంనాయక్ పర్యటనను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అడ్డుకున్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని బలరాంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మణుగూరు మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉందని, అక్కడికి రావాలని బలరాంనాయక్ స్థానిక కార్యకర్తలకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న రేగా, ఆయన వర్గీయులు ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రెస్‌మీట్ ఉందా అని విలేకరులు రేగాను ప్రశ్నించగా.. ‘ఇక్కడికి ఎవరూ రారు.. మాకు సమాచారం లేదు’ అనిఆయన సమాధానమిచ్చారు. ఇంతలోనే అక్కడకు బలరాంనాయక్ చేరుకోవడంతో రేగా పార్టీ కార్యాలయం షెట్టర్ వేసి అడ్డుకున్నారు.

‘ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి రాకుండా బయట తిరిగిన నీకు ఇప్పుడు  కార్యాలయానికి వచ్చే అర్హత లేదు’ అంటూ బలరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల వాగ్వాదంతో పాటు వారి అనుచరులు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో తోపులాట జరిగింది. ‘నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని.. నీ వల్లే ఇలా జరిగింది’ అని రేగా.. బలరాంపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఏదో జరిగిపోయిందని ఇప్పుడు సయోధ్యతో పనిచేద్దామని బలరాం కాంతారావును పలుమార్లు బుజ్జగించే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన తప్పులకు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని ఆయన అనడంతో ఇద్దరూ పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నారు. మాజీ ఎంపీ వెంట ఉన్న వారు తనపై దాడికి చేయడానికి వచ్చారని, వారిపై కేసు పెడతానని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేగా విలేకరులతో అన్నారు.
 
భద్రాచలంలోనూ బయటపడ్డ వర్గపోరు..
మాజీ ఎంపీ బలరాంనాయక్ భద్రాచలం పర్యటనలోనూ స్థానిక పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ పట్టణ అధ్యక్షుడు నక్కా ప్రసాద్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బలరాంనాయక్ సారపాక బీపీఎల్ గెస్ట్‌హౌస్ నుంచి భద్రాచలానికి బయలుదేరగా, ఆయన వెనుకనే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నక్కా ప్రసాద్ వేర్వేరు వాహనాలపై వస్తున్న క్రమంలో ఒకరికొకరు వాహనాలను తప్పించే ప్రయత్నం చేశారు. వారు బ్రిడ్జి సెంటర్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు వచ్చే సరికి రెండు వాహనాలు ఢీ కొన్నాయి. రెండు వాహనాలూ కూడా కొంత మేర ధ్వంసమయ్యాయి. దీంతో ఇరువురూ వాదనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు చేరిన వీరి పంచాయితీ అంతటితో ఆగకుండా పరస్పర ఫిర్యాదులు చేసుకునేవరకు వెళ్లింది. తనను చంపేందుకే ఇలా చేశారని ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు