మహాశివరాత్రి జాతర: ఎములాడ జాతరకెళ్దాం..

20 Feb, 2020 09:17 IST|Sakshi
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

కోర్కెలు తీర్చే కొండంత దేవుడు రాజన్న

మూడు లక్షల మంది వస్తారని అంచనా

రూ.2.50 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు

గతంలోకంటే భిన్నంగా ఉత్సవాలు

గుడి చెరువు ఖాళీస్థలంలో శివార్చన

నేటి నుంచి జాతర ఉత్సవాలు షురూ

సాక్షి, వేములవాడ: తెలంగాణ జిల్లాల్లోనే పేదల దేవుడిగా..దక్షిణకాశీగా ఎముడాల రాజన్న ఆలయం వెలుగొందుతోంది. రాజన్న సన్నిధానంలో ఈ నెల 20 నుంచి మహాశివరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మూడు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న జాతర ఉత్సవాలను రూ. 2.50 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో శివార్చన అనే ప్రత్యేక సాంస్క ృతిక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. 

స్థల పురాణవిుదీ..
ఈ క్షేత్రంలో స్వామి వారి లింగరూపుడై గర్భగుడిలో భక్తులకు దర్శనమిస్తాడు. రాజన్న గుడికి సంబంధించిన అనేక పురాతన గాథలున్నాయి. పూర్వం నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ పాపాలతో బాధపడుతున్న జనాన్ని చూసి వారికి విముక్తి కలిగించేందుకు పరమశివుడిని వేడుకోగా స్వామి కాశీలో శివుడు ఉద్భవించినట్లు చెబుతుంటారు. అక్కడ శివుడు సంతప్తి చెందక వేములవాడకు చేరుకున్నాడని, శివుడి వెంట భాస్కరుడు వచ్చాడని ప్రతీతి. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగానూ.. హరిహరక్షేత్రంగా పిలుస్తారు.  

చారిత్రక విశిష్టత... 
క్రీ.శ.750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన గావించారని చారిత్రక ఆధారాలుండగా, వీరికి పూర్వమే శాతవాహనులు పరిపాలించినట్లు ఆధారాలున్నట్లు చెబుతుంటారు. శాతవాహనుల కాలం నాటికే వేములవాడలో జైనులు, బౌద్ధుల ఆచార వ్యవహారాలు తెలిపే విగ్రహాలు అనేకం నేటికి ఉన్నాయి. 

రాజన్న చెంతకు చేరుకోవడం ఇలా... 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్లు . రాజన్నను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. హైదరాబాద్‌ నుంచి ప్రతీ అరగంటకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. రైల్వే సౌకర్యం లేదు. పెద్దపల్లి, వరంగల్, కామారెడ్డికి రైల్వే మార్గంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వేములవాడకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాళ్లు సిద్దిపేట ద్వారా, వరంగల్‌ నుంచి వచ్చే వారు కరీంనగర్‌ మీదుగా వేములవాడకు చేరుకునే రోడ్డు మార్గం ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి చెరువు కట్టకింద ప్రత్యేక బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కౌంటర్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు 600 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. టూరిజం ద్వారా బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ గుడి చేరుకునేందుకు వీలుగా ఉచిత మినీబస్సులు ఏర్పాటు చేశారు. 

కోడె మొక్కు విశిష్టత..  మత సామరస్యానికిది ప్రతీక
సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో కొడుకు పుడితే కోడె కట్టేస్తా రాజన్నా అంటూ మొక్కుకుంటారు. సంతానం కల్గిన అనంతరం వేములవాడకు చేరుకుని స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకుంటారు. వ్యవసాయం బాగుండాలని మొక్కుకునే రైతుల సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు తమ ఇంటివద్ద పెంచి పెద్దచేసిన కోడెలను (నిజకోడె) స్వామి వారికి అప్పగించి మొక్కులు తీర్చుకుంటారు. కోడెలను కట్టేసే ఆచారం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలోని గర్భగుడి సమీపంలో మతసామరస్యానికి ప్రతీకగా దర్గా ఉంది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు దర్గాలోని ఖాజాబఖశ్వార్‌ను దర్శించుకుంటారు. 

ధర్మగుండం స్నానాలు... తలనీలాల మొక్కులు 
మొట్టమొదట ఈ ధర్మగుండం మడుగుగా ఉండేది. నరేంద్రమహారాజు కుషు్టవ్యాధితో బాధపడుతూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానమాచరించడంతో కుష్టువ్యాధి నయమైనట్లు స్థలపురాణం కథనం. అందుకే దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడే వారు ధర్మగుండంలో స్నానాలు చేస్తే వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధర్మగుండంలో ఉచితంగా స్నానం చేయొచ్చు. అనంతరం కల్యాణకట్టలో రూ.10 చెల్లించి టికెట్‌ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. రాజన్న మొక్కులు చెల్లించుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించుకుంటారు.

పూజలు– దర్శనీయ స్థలాలు 
రాజన్న జాతర సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి కేవలం స్వామి వారి దర్శనాలు, కోడె మొక్కులు మాత్రమే అనుమతిస్తారు. రాజన్న ఆలయంతోపాటు వేములవాడ పరిసరాల్లో అనుబంధంగా అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాల స్వామి, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవాలయాలున్నాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లోనూ పూజలు చేస్తారు. 

వసతి గదులు... ప్రసాదాలు 
స్వామి వారి సన్నిధికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ విచారణ కార్యాలయానికి చేరుకుని అద్దె గదులు తీసుకుంటారు. స్వామి వారి గదులు లభించని భక్తులు ప్రైవేటు లాడీ్జలను ఆశ్రయిస్తారు. భక్తుల కోసం 476 వసతి గదులున్నాయి. అయితే జాతర సందర్భంగా ఈ గదులను అద్దెకు ఇవ్వకుండా జాతర ఏర్పాట్ల కోసం వచ్చిన అతిథులకు కేటాయిస్తారు. దీంతో భక్తులు ప్రైవేట్‌ లాడ్జ్‌లు లేదా ఆలయం వారు వేసిన చలవపందిళ్ల కిందే వంటావార్పు చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రైవేట్‌ లాడ్జ్‌ల నిర్వాహకులు రద్దీని బట్టి గదుల రేట్లను పెంచేస్తారు. ఒక్కో గదికి రూ.500 నుంచి మొదలుకుని రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, పాతఆం«ధ్రాబ్యాంకు భవనంలో ప్రసాదాల కౌంటర్‌ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.15, పులిహోరా పాకెట్‌ రూ.10 చొప్పున భక్తులకు అందిస్తారు. 

రాజన్న జాతర పూజలు... 
మహాజాతర సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఫ్రీగా ధర్మదర్శనం, రూ.50 చెల్లించి స్పెషల్‌ దర్శనాలు, రూ.100 చెల్లించి కోడె మొక్కులు, రూ.200 స్పెషల్‌ కోడె మొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు తీసుకుని దర్శించుకోవచ్చు. ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంతరం సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు స్థానికుల దర్శనాలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తారు), 3.30 గంటల వరకు కౌన్సిలర్లు, ప్రజాప్రతిని«ధులకు, 21న ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధి స్వామి వారికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు అందిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. 

రాజన్న భక్తులకు  3 లక్షల లడ్డూలు
వేములవాడ : ఎములాడ రాజన్న భక్తులకు మూడు లక్షల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్‌చార్జీలు రెండు రోజులుగా పనుల్లో వేగం పెంచారు. అదనపు కార్మికులతో పెద్దఎత్తున లడ్డూ ప్రసాదం తయారు చేయిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధంగా ఉంది. 20, 21, 22వ తేదీల్లోనూ భక్తులు వచ్చే రద్దీని బట్టి మరో లక్షలడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దేవాదాయశాఖ లడ్డూ తయారీలో ప్రత్యేక శ్రద్ధచూపుతోంది. ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. గోదాం ఇన్‌చార్జి వరి నర్సయ్య మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు 3 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారని తెలిపారు.

ఉచిత భోజనం.. తాగునీటి సౌకర్యం
జాతర సందర్భంగా మూడురోజులపాటు స్థానిక వైశ్యసత్రం ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజన సౌకర్యం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదానంలో ఉచిత భోజన వసతి కలదు. భక్తుల దాహార్తి తీర్చేందుకు 4 లక్షల నీటి పాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని క్యూలైన్లలోని భక్తులకు అందిస్తారు. వీటితోపాటు ప్యూరిఫైడ్‌ వాటర్‌ను కూడా భక్తులకు అందిస్తారు. 

అత్యవసర సేవలు 
జాతర పర్వదినాల సందర్భంగా ఆలయం ఎదుట పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 18004252037 ఇచ్చేశారు. ఇవే కాకుండా నిరంతరం పోలీసు గస్తీ బృందాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. పార్కింగ్‌ స్థలాలు, వసతి గదుల వద్ద కూడా నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీటిన్నింటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్‌ ఆఫీసర్‌తోపాటు 13 మంది నోటల్‌ ఆఫీసర్లను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నియమించారు. వీటితోపాటుగా అంబులెన్స్, ఫైర్‌సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు. 

భక్తులకు ఇబ్బందులు రానివ్వం
రాజన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధశాఖల అధికారుల సమన్వయంతో జాతర ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటున్నాం. 
– కృష్ణవేణి, ఆలయ ఈవో

రాయదండి శ్రీరామేశ్వరుడు
రామగుండం:అంతర్గాం మండల పరిధిలోని రాయదండి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీచిలుకల రామేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. రెండురోజులపాటు జరిగే వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

రాయదండి ఆలయానికి ఎనిమిది శతాబ్దాల చరిత్ర
క్రీస్తు పూర్వం ఎనిమిది శతాబ్దాల క్రితం ఇక్కడ చాళక్యులు, చోళరాజులు పాలించినటువంటి ప్రాంతంగా పూర్వీకులు చెబుతారు. ఇక్కడ రాజులు దండిగా ఉండేవారు కావడంతో రాజులదండి పేర్కొంటుండగా కాలక్రమేణా దీనికి రాయదండిగా పేరు వచ్చింది. చిలుకల రామేశ్వరాలయం గర్భగుడిలో అమ్మవారి ముక్కు పుడక, కాళ్లకు గజ్జెలు ధరించిన విగ్రహ రూపం, గణపతి, నలుదిక్కుల నాలుగు నందీశ్వరుడి ఉత్సవ విగ్రహాలు వీటితోపాటు శ్రీలక్షి్మనర్సింహాస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి, నాలుగు దిశలలో ఆంజనేయస్వామి విగ్రహాలుండేవి. వల్లుబండ, సనాతన ఆలయంలో ప్రతీరోజు రాజుల అన్నదానంతో ప్రాంతమంతా పూర్తి ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్నట్లు చరిత్రలో ఉంది. తొంభై రకాల ఆంజనేయస్వామి రూపాలు ఉండేవి. ప్రస్తుతం ఆలయానికి దక్షిణంలో దాసాంజనేయస్వామి విగ్రహం మాత్రమే మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు.  

కల్యాణ మహోత్సవ వేడుకల షెడ్యూలు
భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన శుక్రవారం ఉదయం వేకువజామున సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకం నిత్యారాదణ, తొమ్మిది గంటలకు గణపతి పుణ్యహవచనం, ప్రదోషకాలపూజ ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, స్వామివారికి వస్త్రాలు సమర్పణ, రాత్రి 8.05 గంటలకు స్వామి కల్యాణ మహోత్సవం, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం తీర్థవితరణ, అర్ధరాత్రి 12లకు లింగోద్భావ కాలములో ఉపన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తదనంతరం జాగరణ, భజన కార్యక్రమంతో ముగింపు. మరుసటి రోజు (శనివారం)లింగోద్భావ కాలంలో స్వామివారి నాగవెళ్లి, పల్లకీసేవ, అన్నదానంతో ముగింపు. 

తొంబర్రావుపేట పాలరాతి శివుడు
మేడిపెల్లి(వేములవాడ): సాధారణంగా అన్ని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తే ఇక్కడ మాత్రం శివుడి నిజరూపదర్శనం భాగ్యం లభించడం ఇక్కడి ప్రత్యేకత. ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడి విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. అదే మేడిపెల్లి మండలంలోని తొంబర్రావుపేట శివాలయంలోని శివుడి విగ్రహం. ఐదు ఫీట్ల ఎత్తుతో ఏకశిల పాలరాతితో ద్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇక్కడికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల ప్రజలు, భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. లక్షి్మసత్యనారాయణస్వామి విగ్రహాలు కూడా పాలరాతివే ప్రతిష్టించారు. రామలక్ష్మణులు, సీతా, హన్మంతుడి విగ్రహాలు కూడా ఇక్కడ నెలకొల్పారు.

45 ఏళ్లకిందట మామూలు గుడిగా..
గ్రామానికి చెందిన అడ్లగట్ట గంగారాం ముంబాయిలో పని చేసుకుంటుంటుండేవాడు. ఈ నేపథ్యంలో 1965లో ఆయనకు శివుడి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చి అMý్కడే పూనేలోని పాలరాతి విగ్రహాలు తయారు చేసే ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ పాలరాతి శివుడి విగ్రహాన్ని చూసిన గంగారాం ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని కొనుగోలు చేశాడు. ఇక్కడికి తీసుకొచ్చి సొంతఖర్చులతో చిన్నగుడి కట్టి అందులో ప్రతిష్టించాడు. ఆలయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శివుడి విగ్రహంతోపాటు సత్యనారాయణస్వామి, రాముడు,సీతా, లక్ష్మణుడు, హన్మంతుడు వంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని విస్తృతపరిచారు. నవగ్రహ మంటపాన్ని కూడా ఏర్పాటు చేశారు.  
శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి..
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 20 నుంచి 23 వరకు నాలుగురోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 20న స్వస్తిపుణ్యహవచనం, స్థాపిత దేవతలపూజ, అభిషేకాలు, 21న స్వామివారి కల్యాణం, జాగారణ, లింగోధ్బావ, 22న రథోత్సవం, అన్నదానం, 23న బద్దిపోచమ్మకు బోనాలు ఉంటాయి.

 

టెంపుల్‌ టౌన్‌  మంథని
మంథని: ప్రాచీనచరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని దేవాలయాలకు నిలయమై టెంపుల్‌టౌన్‌గా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయకుడి గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమ ముఖ శివలింగం మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో అన్ని దేవతలకు సంబంధించిన దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. మహా శివరాత్రి పర్వదినాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఓంకారేశ్వరుడు, శ్రీలేశ్వర సిద్దేశ్వర దేవాలయం,పశి్చమ ముఖం గల శివలింగం ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. 

సమాచార ఫోన్‌ నెంబర్లు ఇవీ..
జాతర ఉత్సవాల చైర్మన్, 
జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌–     7093364111
జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే –     8332831100
డీఎస్పీ చంద్రకాంత్‌‡–     8500149182
కార్యనిర్వాహణ అధికారి కృష్ణవేణి –    9491000743 
ఏఈవోలు, ఉమారాణి–     9247307754
స్థానిక వైద్యాధికారి మహేశ్‌రావు–     9440078901
డీఎం ఆర్టీసీ భూపతిరెడ్డి –     9959225926 
టౌన్‌ సీఐ సీహెచ్‌ శ్రీధర్‌–     9440795165 
రాజన్న జాతర టోల్‌ఫ్రీ నంబర్‌.    18004252037

మరిన్ని వార్తలు