పీసీసీఎఫ్‌గా ఆర్‌.శోభ

1 Aug, 2019 02:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌)–ఎఫ్‌ఏసీగా రొయ్యూరు శోభ నియమితులయ్యారు. పీసీసీఎఫ్‌గా నియ మితులైన మహిళా ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్లో  దక్షిణాది రాష్ట్రా ల్లో మొదటివ్యక్తిగా, దేశంలోనే నాలుగో మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. బుధవారం పీసీసీఎఫ్‌గా పదవీ విరమణ చేసిన ప్రశాంత్‌కుమార్‌ ఝా నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అరణ్యభవన్‌లో ఆమెను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ ఎస్కే జోషి , ఇతర అధికారులు అభినందించారు. ఆర్‌.శోభను పీసీసీఎఫ్‌ (ఎఫ్‌ఏసీ)గా నియమిస్తూ బుధవారం సీఎస్‌ ఎస్కేజోషి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె పీసీసీఎఫ్‌ పోస్టులో చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా కొనసాగుతారని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.

యూపీ డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ, అనంతపురంలోని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయోసైన్స్‌లో పట్టా పొందారు. 1986లో ఆమె ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన ఆమెకు పీసీసీఎఫ్‌ ర్యాంకుతో పదోన్నతి కల్పించారు. దాంతో తెలుగురాష్ట్రాల నుంచి అటవీశాఖలో పీసీసీఎఫ్‌ వంటి అత్యున్నత ర్యాంక్‌ చేరుకున్న తొలి మహిళగా శోభ నిలిచారు. అప్పటి నుంచి ఆమె అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్‌(ఎఫ్‌సీఏ)గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు మూడేళ్ల పాటు అదనపు పీసీసీఎఫ్‌ (ఎఫ్‌సీఏ)గా పనిచేశారు. 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె భర్త ఆర్‌.సుందరవదన్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పదవీ విరమణ చేశారు. 
 

మరిన్ని వార్తలు