శోభన కామినేని ఓటు గల్లంతు

12 Apr, 2019 06:51 IST|Sakshi
రెండు ఓట్లున్న వారి జాబితాలో ఉన్న శోభన కామినేని పేరు

బీఎల్‌ఓ సస్పెన్షన్‌

సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి నియోజకవర్గం విజయనగర్‌కాలనీలో నివాసం ఉండే అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్మన్‌ శోభన కామినేని ఓటు గల్లంతయింది. పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తీరా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాక అక్కడ తన ఓటు తొలగించినట్లు తెలుసుకొని నివ్వెరపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు ఇప్పుడెలా పోయిందంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పౌరురాలినైన తనకు ఇది ఎంతో విచారకరమైన రోజని  ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ పౌరురాలిని కాదా ? నాకు ఓటు ముఖ్యం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఓటు వేశాననే సంతృప్తి కోసం చాలెంజ్‌ ఓటు వేయవచ్చునని సిబ్బంది చెప్పారని, లెక్కింపునకు నోచుకోని ఓటెందుకని ఆమె ప్రశ్నించారు.

బీఎల్‌ఓపై వేటు..
శోభన కామినేని ఓటు తొలగింపునకు బాధ్యుడైన బీఎల్‌ఓ (బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌)గా విధులు నిర్వహిస్తున్న హెల్త్‌ విభాగం ఉద్యోగి ఓం ప్రకాశ్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఔట్‌సోర్సింగ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్‌ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్న ం సర్కిల్‌లోని విజయనగర్‌కాలనీ పోలింగ్‌బూత్‌ 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఈ రెండింటిలో ఒకదాన్ని తొలగించాల్సిందిగా  సహాయ ఎన్నికల అధికారి బీఎల్‌ఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత 7ఏ నోటీసులు లిఖితపూర్వకంగా జారీ చేయకుండా శోభనకు చెందిన రెండు ఓట్లను బీఎల్‌ఓ తొలగించారు. చెక్‌ చేయకుండానే రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల ప్రక్రియలో శిక్షణ వ్యవహారాల నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్న  జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ శశికిరణాచారిని నియమించారు.   

ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఉపాసన
శోభన ఓటు గల్లంతుపై ఆమె కుమార్తె  ప్రము ఖ హీరో రామ్‌చరణ్‌ తేజ్‌  భార్య ఉపాసన ట్విట్టర్‌ వేదికగా స్పందిచారు. పది రోజుల క్రితం ఓటరు జాబితాలో ఉన్న  తన తల్లి పేరు ఇప్పుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. తన తల్లి కూడా ప్రభుత్వానికి పన్ను కడు తోందని, భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఘాటుగా స్పందించారు.

మరిన్ని వార్తలు