ఉడుత తెచ్చిన తంటా!

17 Apr, 2014 02:01 IST|Sakshi
మృతిచెందిన జీవాల వద్ద రోదిస్తున్న బాధితులు, ప్రమాదానికి కారణమైన ఉడుత

స్తంభంపై విద్యుత్ తీగలపైకి ఎక్కిన ఉడుత  
షార్ట్ సర్క్యూట్‌తో తెగిపడిన తీగ
విద్యుదాఘాతంతో కింద ఉన్న పాకల్లోని 91 జీవాల మృత్యువాత  
శామీర్‌పేట్ మండలం కేశవరంలో ఘటన

 

 

 శామీర్‌పేట్, న్యూస్‌లైన్:  ఓ ఉడుత 91 జీవాల మృతికి కారణమైంది. విద్యుత్ స్తంభంపై రెండు తీగలపైకి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కింద ఉన్న పాకలపై కరెంట్ తీగ పడడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి 91 జీవాలు(మేకలు, గొర్రెలు) మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేశవరంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాయాదులు బొమ్మలపల్లి శ్రీశైలం, యాదయ్య, ఐలయ్యలు జీవాలను సాకుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

 వీరు గ్రామ సమీపంలోని బండారిగుట్ట వద్ద పక్కపక్కనే మూడు పాకలు ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం కేశవరం- లక్ష్మాపూర్ మధ్య ఉన్న 33/11 కేవీ కెపాసిటీ విద్యుత్ తీగలపై ఓ ఉడుత ఎక్కింది. రెండు(ఎర్త్, ఫేజ్) తీగలను అది తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో కరెంట్ తీగ తెగి బొమ్మలపల్లి శ్రీశైలం పాకపై పడిపోయింది.

మంటలు చెలరేగడంతో గొర్రెలు, మేకలు పరుగెత్తి ఇనుప ఫెన్సింగ్‌ను తాకాయి. దీంతో పాకల్లో ఉన్న బొమ్మలపల్లి శ్రీశైలానికి చెందిన 61, బొమ్మలపల్లి యాదయ్యకు చెందిన 24, ఐలయ్యకు చెందిన మూడు 6.. మొత్తం 91 జీవాలు మృత్యువాతపడ్డాయి. కాగా ప్రమాదంలో మరో 30 జీవాలు క్షేమంగా బయటపడ్డాయి.

స్థానికుల సమాచారంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. కష్టపడి పోషించుకుంటున్న జీవాలు మృతిచెందడంతో వాటి యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ట్రాన్స్‌కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒక్కోజీవానికి తమ శాఖ తరఫున రూ. 2 వేలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

 పరామర్శించిన ఎమ్మెల్యే..
 జీవాల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఎల్లార్, పలు పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం కేఎల్లార్ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ తీగలు ఉన్నచోట్ల కాపరులు పాకలు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు.

 ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ైధె ర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన ఉడుత కూడా మృతిచెందింది.

>
మరిన్ని వార్తలు