కెమెరా టెక్నిక్స్‌.. షార్ట్‌ఫిలిమ్స్‌ సూపర్‌హిట్‌..

14 Jul, 2020 08:03 IST|Sakshi

జూబ్లీహిల్స్‌: ఓ చిన్న 5డీ కెమెరాతో ఫొటోగ్రఫీ రంగంలో సత్తా చాటుతూ.. ఇప్పటికే వందలాది లఘుచిత్రాలను తన కెమెరాతో చిత్రీకరించి శెభాష్‌ అనిపించుకుంటున్నాడు యూసుఫ్‌గూడ వెంకట గిరిబస్తీలో నివసించే యువ సినిమాటోగ్రాఫర్‌ సుధాకర్‌. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు  చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి   నుంచే ఫొటోగ్రఫీ అంటే మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్‌ఫోన్లు రంగప్రవేశం చేయడం, వాటిలో అత్యుత్తమ నాణ్యత కలిగిన కెమెరాలు రావడంతో ఫోన్‌లో కూడా చిత్రీరణ చేసి భళా అనిపించుకున్నాడు.  

షార్ట్‌ఫిలిమ్స్‌తో సత్తా..నాలుగైదేళ్లుగా షార్ట్‌ఫిలిమ్స్‌
విజృంభణతో ఫొటోగ్రఫీని ఉపాధి అవకాశంగా మార్చుకున్నాడు. షార్ట్‌ఫిలిమ్‌ మేకింగ్‌లో పట్టుసాధించి ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా షార్ట్‌ఫిలిమ్స్‌కు కెమెరామెన్‌గా పనిచేశాడు. అలాగే 10 ఇండిపెండెంట్‌ చిత్రాలకు, శివ 143, రహస్యం అనే చలనచిత్రాలకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మరో రెండు సినిమాలకు ఛాయగ్రహకుడిగా అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్‌ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్‌ ఫొటోగ్రఫీ నిర్వహించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాస నువ్వే, రుధిరం తదితర లఘుచిత్రాలకు మంచిపేరు వచ్చింది. యూట్యూబ్‌లో పెద్దహిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

షార్ట్‌ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నా..
ఫొటోగ్రఫి తిలక్‌ దగ్గర నేర్చుకున్నాను. మా ఊరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేశాను. రామ్‌గోపాల్‌ వర్మ స్ఫూర్తిగా చిట్టీలు వేసి డబ్బులు జమచేసి 5డి కెమెరా కొనుగోలు చేశాను. క్రమంగా షార్ట్‌ఫిలిమ్స్‌కు పనిచేస్తూ పేరు సంపాదించాను. నా ఫేస్‌బుక్‌ పేజ్‌కు 5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్‌ పేజ్‌కు 5వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో కొనసాగుతూ మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.  – సుధాకర్, షార్ట్‌ఫిలిమ్స్‌ సినిమాటోగ్రాఫర్‌  

మరిన్ని వార్తలు