మంచుతో పోరాటం...

26 Jan, 2019 11:04 IST|Sakshi

మంచుకత్తి...మనసైనిక శక్తి...

సైనికుల సియాచిన్‌ కష్టాలపై తొలి లఘుచిత్రం

సిటీ యువకుడి 1000 రోజుల కృషి ఫలితం

ది డయ్యింగ్‌ సోల్జర్‌ ప్రదర్శన నేడు

ఆ కుర్రాడు ఎరోనాటికల్‌ ఇంజనీర్‌.  అప్పుడప్పుడు సరదాగా షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించేవాడు. మూడేళ్ల క్రితం మంచుకొండపై భారతీయ సైనికులు పడుతున్న కష్టాల్ని కళ్లకు కట్టిన ఓ సంఘటన అతనిపై చెరగని ముద్ర వేసింది. సియాచిన్‌పై  సినిమా తీసే బృహత్తర యత్నానికి ‘తెర’లేచింది.

సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: ‘‘–60 డిగ్రీల చలి అంటే మాటలా? పాకిస్తాన్‌ సైన్యం కంటే వాతావరణమే మన సైనికులకు అక్కడ పెద్ద శతృవు. అలాంటి సియాచిన్‌ ప్రాంతంలో రెండేళ్ల క్రితం సంభవించిన  అవలాన్జ్‌ కారణంగా 10 మంది భారతీయ సైనికులు మంచులో చిక్కుబడిపోయారు. అందులో లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప మాత్రమే బతికారు. ఆ దుస్సంఘటన కలిచివేసింది. సియాచిన్‌లో సైన్యం కష్టాల గురించి దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనిపించింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు వినయ్‌ సింగ్‌. తన సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలను ఆయన సాక్షితో ఇలా పంచుకున్నారు...  

జవాన్‌కి జై...జాబ్‌కి గుడ్‌బై...
నేను ఈ సినిమా గురించి ఈ రంగానికి చెందిన పలువురితో చర్చించినప్పుడు చాలా మంది సాంకేతిక నిపుణులు ఇలాంటి సబ్జెక్ట్‌కు పెద్ద బడ్జెట్‌ లేకుండా అసాధ్యమన్నారు. ప్రయత్నిద్దాం అన్నా ఎవరూ సహకరించలేదు. కాని నాకు ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి ఎందుకు తీయలేం? అనేదే ఆలోచన. దాంతో ఈ సినిమా నేనే తీద్దాం అని సిద్ధమయ్యాను. దీని కోసం పూర్తి సమయం కేటాయించాలని అనుకున్నాను. జాబ్‌ వదిలేశాను. అయితే నాకు అప్పటిదాకా పూర్తి స్థాయిలో సినిమా తీసిన అనుభవం లేదు. తొలిసారే బాగా క్లిష్టమైన సబ్జక్ట్‌. ఒక్కడ్నే ఒంటి చేత్తో అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. కధతో మొదలుపెట్టి నటన, యానిమేషన్, విఎఫ్‌ఎక్స్‌ వర్క్, సంగీతం, మేకప్, ఎడిటింగ్, దర్శకత్వం... అన్నీ నేనే తలకెత్తుకున్నాను. ఎందులోనూ అనుభవం లేకున్నా  సరే ప్రతీ అంశాన్నీ కొన్ని రోజులు స్టడీ చేయడం ఆచరణలో పెట్టడం ఇలా కొనసాగించాను. 

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వినయ్, కుటుంబసభ్యులు
డాబా మీదే...సియాచిన్‌
సియాచిన్‌ ప్రాంతం దాకా వెళ్లేంత బడ్జెట్‌గాని అంత మంది నిపుణుల బృందం గాని నా దగ్గర లేదు. అదే సమయంలో అవతార్, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి సినిమాలు పూర్తిగా స్టూడియోలో తీశారనే విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాను. ఇసిఐఎల్‌ దగ్గర ఆర్‌కెపురంలో ఉన్న మా బిల్డింగ్‌ టెర్రస్‌పైన నీలిరంగు మూవీ క్లాత్‌ను అరేంజ్‌ చేసుకుని షూట్‌ చేశాను. 90శాతం మూవీ టెర్రస్‌పైనే పూర్తయింది. అప్పటి దాకా విఎఫ్‌ఎక్స్‌ అంటే ఏంటో కూడా తెలీని నేను దాదాపు సినిమా మొత్తం విఎఫ్‌ఎక్స్‌లోనే తీశానంటే నాకే ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాకపోతే చాలా టైమ్‌ పట్టింది. చాలా సార్లు వదిలేద్దాం అనుకున్నాను. కాని ఎప్పటికప్పుడు పట్టుదల పెంచుకుంటూ పోయాను. ఈ నెల 24న పూర్తయింది. నిజానికి ఈ చిత్రాన్ని అన్ని హంగులూ, నిపుణులతో తీస్తే కనీసం రూ.10లక్షలు ఖర్చు అవుతుంది. నేను రూ. 33 వేలతో పూర్తి చేయగలిగాను. దీనికి దాదాపు మూడేళ్లు ఖచ్చితంగా చెప్పాలంటే 1000 రోజులు పట్టింది. ఇందులో తన తల్లి ఉషా నటించారని, సినిమాటోగ్రఫర్‌గా రంజిత్, డైలాగ్‌ రైటర్‌గా శ్రావ్య మానస వ్యవహరించారని చెప్పారు.

ప్రజలకు తెలియాలి...సైనికులకు నివాళి...  
ప్రపంచపు అత్యంత క్లిష్టమైన యుద్ధ ప్రాంతం వేదికగా మనకు సేవ చేస్తున్న సైనికులకు  నివాళిగా  డైయింగ్‌ సోల్జర్‌  చిత్రాన్ని తీశాను.. ట్రైలర్‌కి, పోస్టర్స్‌కి పాజిటవ్‌ రెస్పాన్స్‌ వస్తుంటే ఆనందంగా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా సైనికుల త్యాగాలు అందరికీ తెలియాలన్నదే నా ఆకాంక్ష. మన సైనికుల గురించి మనమంతా గర్వించాలనే తపన. అంతే తప్ప దీని నుంచి ఆదాయం పొందాలనే ఆలోచన లేదు. రిపబ్లిక్‌ డే ను పురస్కరించుకుని ఈ సినిమాను ఉచితంగా ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రదర్శిస్తున్నాం. గత 1000 రోజుల పాటు నేను పొందిన భావోద్వేగాలను ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను.  ఈ షార్ట్‌ఫిల్మ్‌కు సంబంధించి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో  పోస్టర్‌ ఆవిష్కరించారు.

ది డైయింగ్‌ సోల్జర్‌ చిత్రాన్ని చూడాలనుకుంటే...
వేదిక ప్రసాద్‌ ల్యాబ్స్‌శనివారం, సమయం మధ్యాహ్నం
2గంటల నుంచిప్రవేశం: ఉచితం.

మరిన్ని వార్తలు