నేనురాను బిడ్డో..!

19 Jun, 2018 09:18 IST|Sakshi
ఆస్పత్రిలో పడకల దుస్థితి 

సర్కారు వైద్యంపై కానరాని నమ్మకం

పేద రోగులు సైతం దూరమవుతున్న వైనం

క్లస్టర్‌ ఆస్పత్రుల్లోనూ మహిళా వైద్య నిపుణులు కరువు

ఏటేటా తగ్గుతున్న ప్రసవాల సంఖ్య

లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు మూలకు..

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

పరిగి వికారాబాద్‌ : సర్కారు దవాఖానాలపై ప్రజలు రోజురోజుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆస్పత్రులపై నమ్మకాన్ని పాదుగొల్పేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ పెద్దగా ఫలితాలనివ్వటంలేదు. చివరకు పేద నిరుపేదలు సైతం ప్రభుత్వ ఆస్పత్రులకు దూరమవుతున్నారు. మందుబిల్లల కోసమో.. సూదిమందు కోసమో అయితే ప్రభుత్వాసుపత్రి పరవాలేదనుకుంటున్నారు కాని .. ఆస్పత్రిలో అడ్మిట్‌ కావటం, కాన్పులు లాంటివి చేసుకోవటమంటే జంకుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిని నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టలేమని  చెప్పకనే చెబుతున్నారు. సర్కారు దవఖానాల్లో ఆయా వైద్యం కోసం  వచ్చి వెళుతున్న రోగుల గణాంకాలే ఈ విషయాలను నిరూపిస్తున్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహకాలు  ప్రకటించినా.. కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నా.. కాన్పుల సంఖ్య  పెరగటంలేదు. ప్రధానంగా ప్రభుత్వ దవాఖానాలకు పాయిజన్‌ కేసులు, ప్రమాదాలు జరిగే సమయంలో ప్రథమ చికిత్సలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్పిస్తే సాధారణ రోగాలతో ఎవరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరటంలేదు.

ప్రసవాలు అంతంతే..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్న వారి సంఖ్య మొత్తం కాన్పుల్లో 20 శాతం కూడా ఉండటంలేదు. 70నుంచి 80 శాతం వరకు  ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పేదలు సైతం అప్పు చేసైనా ప్రైవేటు ఆస్ప్రతుల్లోనే చేరుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ, గిరిజన తండాల్లో  10 శాతానికి పైగా ఇళ్ల వద్దే కాన్పులు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు పరిగి మండలంలో ప్రతి నెలా కొత్తగా 300 నుంచి 400 వరకు గర్భిణులు నమోదవుతున్నారు.

ఇదే క్రమంలో నెలలో సరాసరి 300 పై చిలుకు మహిళలు ప్రసవిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున 50 మించి కాన్పులు కావడంలేదు. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రాభుత్వం ప్రారంభించక ముందు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల్లో 246 కాన్పులు కాగా.. పథకం ప్రారంభించాక ఆరు నెలల్లో 240 కాన్పులు జరిగాయి. పరిగి లాంటి క్లస్టర్‌ స్థాయి ఆస్పత్రిలో మహిళా వైద్య నిపుణులు లేకపోవటం కూడా ప్రసవాల తగ్గుదలకు కారణమని స్పష్టమవుతోంది. మండల కేంద్రాల్లోని దవఖానాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. 

ప్రతి సర్కారు డాక్టర్‌కు ప్రైవేటు క్లీనిక్‌

ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల్లో 90శాతానికి పైగా వారి సేవలను ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్నారు.  ఇందులో కొందరు నర్సింగ్‌ హోంలు నిర్వహిస్తుండగా మరి కొందరు క్లీనిక్‌లు, వేరే ప్రైవేటు ఆస్పత్రులలో పనిచేయం సర్వసాధారణమైపోయింది. పరిగిలో ప్రధానంగా పది క్లీనిక్‌లు, నర్సింగ్‌ హోంలలో ఒకటి రెండు మినహా అన్నింటిలోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులే నిర్వహిస్తుండటం గమనార్హం.

ఓ రకంగా చెప్పాలంటే గుర్తింపుకోసమే వారు ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి  పంపిణీ చేస్తున్న వైద్య పరికరాలు సైతం చిన్నచిన్న కారణాలతో మూలకు  పడేస్తున్నారు.

పర్యవేక్షణ గాలికి..

ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. గతంలో క్లస్టర్‌ స్థాయిలో ఎస్పీహెచ్‌ఓ పేరుతో ప్రతి క్లస్టర్‌కు ఒక పర్యవేక్షణాధికారి ఉండేవారు. తెలంగాణా ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాలన ప్రజలకు చేరువవుతుందంటూ  ఊదరగొడుతూనే జిల్లాకో  డీఎంఅండ్‌ హెచ్‌ఓను  నియమించి క్లస్టర్‌ స్థాయి ఎస్పీ హెచ్‌ఓ పోస్టులకు ఉద్వాసాన పలికింది. దీంతో  గ్రామీణ  ప్రాంతాల్లో పర్యవేక్షణ కరువైంది. వైద్యులు,  వైద్య సిబ్బందికి తమనడిగేవారెవరున్నారులే అని అడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యింది.

మరిన్ని వార్తలు