అంగన్‌వాడీలకు బియ్యం, గుడ్లు కరువు  

21 Jun, 2018 08:56 IST|Sakshi
బియ్యం అయిపోయినట్లు చూపుతున్న ఆయా 

 బాలింతలకు భోజనం బంద్‌

రెండు రోజుల్లో  సరుకులు అందచేస్తాం

కేంద్రాలకు  డుమ్మాలు కొడితే చర్యలు

సీడీపీఓ రేణుక

పెద్దేముల్‌(తాండూరు) : అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, గుడ్లు కరువయ్యాయి. ప్రతి నెలా రావాల్సిన సరుకులు (బడ్టెట్‌) నిధులు ఆలస్యం కావడం, జూన్‌లో çసమయానికి  కేంద్రాలకు అందకపోవడంతో  బాలింతలు, గర్భిణులకు భోజనం నిలపేశారు. పెద్దేముల్‌ మండలంలోని 25 పంచాయతీల్లో 53 అంగన్‌వాడీ, 6 మినీ కేంద్రాలున్నాయి. ప్రతి నెలా 25న సెక్టార్‌ మీటింగ్‌ అయిన వెంటనే కేంద్రాలకు సరుకులు అందచేసేది.

జూన్‌లో బడ్టెట్‌ ఆలస్యం కావడంతో పెద్దేముల్‌ మండలంలోని ఆత్కూర్, ఆత్కూర్‌తండా, తట్టెపల్లితో పాటు పలు కేంద్రాల్లో బియ్యం గుడ్లు కరువయ్యాయి. దీంతో చేసేదేమీ లేదంటూ అంగన్‌వాడీ టీచర్లు బాలంతలు, గర్భిణులకు భోజనాన్ని నిలపేశారు. మరికొన్ని కేంద్రాల్లో చిన్న పిల్లలకు బియ్యం ఖరీదుచేసి వంట చేస్తున్నారు. కేంద్రాల్లో టీచర్‌లు కూడా సమయానికి రావడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఈ విషయాన్ని అంగన్‌వాడీ మండల సుపర్‌వైజర్లకు ఫిర్యాదు చేసినా లాభంలేకుండా పోతోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆత్కూర్‌తండా, బండమీదిపల్లితో పాటు పలు కేంద్రాల్లో టీచర్లు కేంద్రాలకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయాలు కేంద్రాలు కొనసాగించారు. కేంద్రాల్లో భోజనం లేకపోవడంతో చిన్నారుల సంఖ్య తగ్గుతోంది.

ఈ విషయమై ఇన్‌చార్జీ సీడీపీఓ రేణుకను వివరణ కోరగా బడ్డెట్‌ రాక సరుకులు లేని విషయం వాస్తవమని, రెండు రోజుల్లో అన్ని కేంద్రాలకు సరుకులు అందచేయడం జరుగుతుందని అన్నారు. కేంద్రాలకు టీచర్‌లు సరైన సమయానికి రాకపోయినా, ఎవరైనా ఫిర్యాదులు చేసినా చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు