సి‘మంట’

21 Jul, 2014 00:53 IST|Sakshi
సి‘మంట’

- ఇంకా తగ్గని సిమెంట్ ధరలు    
- నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
- ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలు

 కరీంనగర్ : సిమెంట్ ధరలు ఇంకా తగ్గడం లేదు. కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి అమాంతంగా ధరలు పెంచా యి. దీంతో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అన్నిరకా ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాలంటేనే బెంబేలెత్తుతున్నారు. సిమెంట్ కంపెనీల తీరుకు నిరసనగా ఈనెల 5నుంచి బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేయడం కూడా నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం భవన నిర్మాణాలకు అనువైన సీజన్ కాదు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నిర్మాణాలకు అనువైన కాలం. ఈ కాలంలోనే నిర్మాణాలు అధికంగా జరుగుతాయి.

సిమెంట్ ధరలు పెరిగినా ఈ కాలంలోనే. జూలై నుంచి వర్షాలు పడటం వల్ల నిర్మాణాలు అంతం త మాత్రంగా ఉంటాయి. అన్‌సీజన్ అయిన వర్షాకాలంలో ధరలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూలై మొదటి వారంలో బస్తా రూ.225 నుంచి రూ.230 ఉండగా.. ప్రస్తుతం రూ.320కి చేరింది. నెల రోజుల్లోనే ఏకంగా ఒక్కో బస్తాపై రూ.వందకు పైగా పెరగడంతో రియల్టర్లు, కాంట్రాక్టర్లు పనులు నిలుపుద ల  చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్టీల్, ఇసుక, చిప్స్ ధరలు భారీగా ఉన్నాయి. వీటికి సిమెంట్ ధరలు కూడా తోడయ్యాయి. భవిష్యత్‌లో గృహాలు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ధరలు గుదిబండగా మారాయి. సీజన్‌లో జిల్లాలో సు మారు 40 వేల టన్నుల సిమెంట్ వినియోగమవుతోం ది. ఇదే అదనుగా సిమెంట్ వ్యాపారులు సైతం ఉన్నపళంగా ధరలు పెంచారనే ఆరోపణలున్నాయి.
 
ఎందుకిలా.. ?
సిమెంట్ ధరలు అమాంతం పెరగడానికి రాష్ట్ర విభజన ఓ కారణమని తెలుస్తోంది. గతేడాది తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల సిమెంట్ రవాణాకు ఆటంకం కలిగింది. రాష్ట్ర విభజన, ఆ వెంటనే ఎన్నికలు ఇలా ఒక దానికొకటి తోడయ్యాయి. వీటితో పాటు కరెంటు కోతలతో ఉత్పత్తి, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. దీనికితోడు వరుసగా ఎన్నికలు రావడంతో కోడ్ ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. కోడ్ అమలుతో చాలా వరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇ ప్పుడిప్పుడే పనులు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు సిమెంట్ ధరలను పెంచి భారీగా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బ్రాండె డ్ కంపెనీల సిమెంట్ ధరబస్తా రూ.320 ఉండగా.. ఇతర సాధారణ బస్తాల ధర రూ.300 వరకు ఉంది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
 
అమ్మకాలు తగ్గాయి
నెలరోజులుగా సిమెంట్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమున్న వారు సిమెంట్ కోనుగోలు చేస్తున్నారు. పనులు చేపడదామనే ఆలోచన ఉన్నవారు విరమించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల పనులు ఆపేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలను అదుపులో పెట్టాలి.
 -చాడ శ్రీనివాస్‌రెడ్డి, సిమెంట్ వ్యాపారి
 
సిండికేట్‌కు గుణపాఠం తప్పదు
 సిమెంట్ కంపెనీలకు గుణపాఠం తప్పదు. ఈ నెల 5 నుంచి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ఆధ్వర్యంలో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేశాం. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సీఎంలను కలిసి విన్నవించాం. మరోసారి కలిసి ఏం చేయాలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటాం.
 -వై.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ జిల్లా చైర్మన్

మరిన్ని వార్తలు