ఇళ్లు కట్టనీకి ఇన్ని తిప్పలా..!

8 Sep, 2017 00:28 IST|Sakshi
ఇళ్లు కట్టనీకి ఇన్ని తిప్పలా..!

► భవన నిర్మాణ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం..  
►  ఆన్‌లైన్‌ దరఖాస్తుల విధానం వచ్చినా మారని తీరు
► నెలలో అనుమతులు జారీ చేస్తామన్న ప్రభుత్వం..  
►  3 నుంచి 4 నెలలు పడుతున్న వైనం..
►  టౌన్‌ ప్లానింగ్‌ పోస్టులు సగానికి పైగా ఖాళీ.. దరఖాస్తులకు బూజు


ఇల్లుగానీ, భవనం గానీ కట్టాలనుకుంటున్నారా.. అయితే నగర, పురపాలక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడానికి సిద్ధమైపోండి. అనుమతులు రావాలంటే ఆ మాత్రం తిప్పలు తప్పేలాలేవు మరి. సిబ్బంది లేక, ఆన్‌లైన్‌ సర్వర్‌ పని చేయక నిర్మాణ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఆన్‌లైన్‌లో 30 రోజుల్లో అనుమతుల జారీకి డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (డీపీఎంఎస్‌) విధానం ప్రవేశపెట్టినా.. క్షేత్రస్థాయిలో అనుమతులు చేతికందేసరికి 3, 4 నెలలు పడుతోంది.      – సాక్షి, హైదరాబాద్‌

సిబ్బంది లేక.. వెబ్‌సైట్‌ పని చేయక..  
రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉండటంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 నగర, పురపాలక సంస్థల్లో 390 టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్లు (టీపీఎస్‌), టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు (టీపీఓ), టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్స్‌ (టీపీబీఓ) పోస్టులుండగా.. 183 మందే పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), ప్రాంతీయ టౌన్‌ ప్లానింగ్, జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాల్లోనూ 180 పోస్టులకు 84 ఖాళీగా ఉన్నాయి.

దీంతో అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. డీపీఎంఎస్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ గంటల తరబడి మొరాయిస్తుండటమూ జాప్యానికి మరో కారణమని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. కాగా, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది లేని మున్సిపాలిటీల్లో పొరుగు మున్సిపాలిటీల టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది వారంలో 3 రోజులు పని చేసేలా సర్కారు సర్దుబాటు చేసింది.

పరిష్కరించరు.. అనుమతులివ్వరు..
లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద లే అవుట్ల క్రమబద్ధీకరణకు చేసుకున్న దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకూ పురపాలికలు అనుమతులివ్వడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వానికి రూ.లక్షలు చెల్లించి అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.

సర్వేయర్ల సమ్మె.. ఆగిన దరఖాస్తులు
బిల్డింగ్‌ ప్లాన్‌ ఉల్లంఘించి నిర్మాణాలు జరపబోమని ఇంటి యజమాని, లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌(ఎల్టీపీ)లు దరఖాస్తుతో పాటు అఫిడవిట్‌ సమర్పించాలని నెల రోజుల కింద కొత్త నిబంధనను పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. ప్లాన్‌ ఉల్లంఘించి నిర్మాణం చేస్తే ఎల్టీపీ లైసెన్స్‌ రద్దు చేసి చర్య లు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. యజమానుల ఉల్లంఘనలతో తమకు సంబంధం లేదని, సంయుక్త అఫిడవిట్‌ విధానం రద్దు చేయాలని 20 రోజులుగా ఎల్టీపీలు సమ్మె చేస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తుల నమోదు ఆగింది.  

శ్రీ 3 నెలలైనా అనుమతి రాలేదు...
జగిత్యాలలోని మోచీబజార్‌లో ఇంటి నిర్మాణం చేపట్టాను. అనుమతి కోసం 3 నెలల క్రితం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు అనుమతి పత్రం లేనిదే బ్యాంకు లోను ఇవ్వమంటున్నారు. ఇప్పటికైనా అనుమతి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.    – కొప్పు శ్రీధర్, జగిత్యాల

శ్రీ అడ్డుగా ఎల్‌ఆర్‌ఎస్‌...
కోదాడ మున్సిపాలిటీలో ఇళ్ల అనుమతులకు ఎల్‌ఆర్‌ఎస్‌ అడ్డంకిగా మారింది. రెండు విడతల్లో 2,100 మంది ప్లాట్ల రెగ్యులరైజ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ 350 దరఖాస్తులే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులపై అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశా. కానీ పట్టించుకోవడం లేదు.     – పొడుగు హుస్సేన్, కోదాడ

>
మరిన్ని వార్తలు