ఎక్కడి చెత్త అక్కడే..

10 Feb, 2018 18:43 IST|Sakshi
జంపన్నవాగు సమీపంలోని పొలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం

మేడారంలో పారిశుద్ధ్య చర్యలు శూన్యం

పంటపొలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ఆందోళన చెందుతున్న ప్రజలు

అధికారుల అలసత్వంతో తప్పని తిప్పలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా చెత్త తొలగింపు పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. జాతరకు వచ్చిన భక్తులు పడేసిన ప్లాస్టిక్‌ గ్లాజులు, పేపర్లు, వ్యర్థాలు పంట పొలాల్లో పేరుకుపోయాయి. ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేసిన రాజమండ్రి కార్మికులు.. జాతర ముగిసిన తర్వాత వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అరకోర కూలీలతో చెత్తను తొలగించడం  సాధ్యం కావడం లేదు. గత జాతర కంటే ఈసారి పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేస్తామనుకున్న అధికారులు అంచనాలు తలకిందులయ్యేలా ఉంది. నామమంత్రంగా పనులు చేపట్టి చివరికి చేత్తులెత్తేస్తారేమోననే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఆందోళనలో రైతులు
పంట పొలాల్లో చెత్తాచెదారం తొలగించపోవడంతో పశు వుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. జాతర సందర్భంగా పాడి రైతులు జాగ్రత్త తీసుకోవాలని పశువైద్యులు సూచించారు. ఈ మేరకు జాతర ముందు నుంచి ఇప్పటికి 20 రోజుల పాటు ఇళ్లలోనే పశువులను కట్టేస్తున్నారు. ఎక్కువ రోజులు పశువులను కట్టేయం వల్ల అవి అనారోగ్యానికి గురియ్యే ప్రమాదం ఉందని యాజమానులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా చెత్త తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పశువులను బయటకు వదిలితే ప్లాస్టిక్‌ పేపర్లు తిని వ్యాధుల బారిన పడతాయని రైతులు చెబుతున్నారు.

గ్రామాల్లో దుర్గంధం
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చెత్తను తొలగించ లేదు. దీంతో నార్లాపూర్, వెంగ్లాపూర్‌ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కలుషిత వాతావరణంతో వ్యాధుల వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కూలీల సంఖ్యను పెంచి చెత్తను తొలగించాల్సిన అవసరం ఉంది.

సరిపడా కూలీలు లేక..
మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, నార్లాపూర్, వెంగ్లాపూర్‌ గ్రామాల్లోని పంట పొలాలు చెత్తాచెదారంతో పరుచుకున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేశారు. తల్లుల వనప్రవేశం అనంతరం వారిని పంపించారు. జాతర సమయంలో వీరి అవసరం ఎంత ఉందో జాతర తర్వాత కూడా అంతే ఉంటుంది. అయితే రాజమండ్రి కార్మికులు వెళ్లడంతో స్థానిక కూలీలతో చెత్తను సేకరించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుత మేడారం, రెడ్డిగూడెం గ్రామాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. మేడారం నుంచి జంపన్న వాగు, కొత్తూరు, నార్లాపూర్‌ వరకు పంట పొలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. సరిపడా కూలీలు లేకపోడంతో చెత్త తొలగింపు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదని అధికారులే చెబుతుండడం గమనార్హం.

వాసన భరించలేకపోతున్నాం
భక్తులు పడేసిన చెత్తాచెదారం కూళ్లిపోయి దుర్వాసన వస్తోంది. బయటకు వెళ్తే చాలు ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలకుండా సౌకర్యాలు కల్పించిన అధికారులు.. స్థానిక గ్రామాల్లోని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.  – ఎనగంటి రాములు, మాజీ ఎంపీపీ

మరిన్ని వార్తలు